Talliki Vandanam Scheme: గుడ్‌న్యూస్‌.. రూ.10,049 కోట్లు విడుదల.. ‘తల్లికి వందనం’కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?

Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme: కొత్త విద్యా సంవత్సరానికి ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ (12వ తరగతి) వరకు చదువుతున్న అర్హ విద్యార్థులకు ఈ పథకం వర్తించనుంది. పథకం అమలుకు మొత్తం రూ.10,120.78 కోట్ల పరిపాలనా అనుమతిని ప్రభుత్వం మంజూరు చేయగా, రూ.10,049 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ నెల 24న అర్హులైన తల్లులు లేదా సంరక్షకుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయనుంది.

ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 67,47,190 మంది విద్యార్థులు, 42,70,802 మంది తల్లులు లేదా సంరక్షకులు లబ్ధి పొందనున్నారు. ప్రతి అర్హ విద్యార్థికి ఏడాదికి రూ.15 వేల ఆర్థిక సహాయం అందించనున్నారు. అయితే ఒక్కో విద్యార్థికి రూ.2 వేల చొప్పున పాఠశాలల అభివృద్ధి కోసం మినహాయించనున్నారు. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూలై 22న తొలి విడతగా 64,76,590 మంది విద్యార్థులకు సంబంధించిన అర్హులు, అనర్హుల జాబితాలను ప్రచురించనున్నారు. అదే రోజు నుంచి ఆగస్టు 3 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరిస్తారు. అనంతరం ఆగస్టు 4 నుంచి 10 వరకు వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి అదనపు అర్హుల జాబితాను సిద్ధం చేస్తారు.

ఇక, ఆగస్టు 25 వరకు ఒకటో తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కొత్త అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు అవకాశం కల్పించనున్నారు. ఆగస్టు 30న అదనపు అర్హుల జాబితాను విడుదల చేసి, అదే రోజు వారికి కూడా ఆర్థిక సాయం జమ చేయనున్నారు. ఆర్టీఈ చట్టం కింద ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అందించే స్కాలర్‌షిప్ మినహా మిగిలిన మొత్తాన్ని ‘తల్లికి వందనం’ పథకం కింద చెల్లించనుంది. విద్యార్థుల చదువుకు ఆర్థిక భారం తగ్గించి, విద్యను మరింత ప్రోత్సహించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం వెల్లడించింది.