నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లి వద్ద నెల్లూరు-ముంబయి జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఓ పెద్దపులి కారుపై దాడి చేసింది. ఈ ఘటనలో కారు ముందుభాగం దెబ్బతింది, కానీ అందులోని ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. కడప జిల్లా గోపవరం మండలం కాలువపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి నెల్లూరులోని కళాశాలలో చేరేందుకు కారులో బయలుదేరారు. కారు కదిరినాయుడుపల్లి సమీపానికి వచ్చేసరికి పెద్దపులి దాడి చేసింది. కారుకు ఎదురుపడిన పులి రోడ్డుపై కొంత దూరం ఈడ్చుకుపోయింది. అనంతరం తీవ్ర గాయాలతో పులి అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. ప్రయాణికులు భయంతో ఉన్నప్పటికీ ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డారు. జిల్లా అటవీశాఖాధికారి రవీంద్రవర్మ సంఘటనాస్థలానికి చేరుకుని, పులి పాదముద్రలను సేకరించారు.