NTV Telugu Site icon

Ancient Ayyappa Idol: ఉప్పాడ తీరానికి కొట్టుకు వచ్చిన అయ్యప్ప విగ్రహం

Ayyappa1

Ayyappa1

సముద్రం ఎంతో సంపదను మనకు అందిస్తుంది. ఉప్పాడ తీర వాసులకు అయ్యప్ప స్వామి విగ్రహ దర్శనం లభించింది. కాకినాడ ఉప్పాడ సముద్ర తీరానికి కొట్టుకువచ్చింది పురాతన అయ్యప్ప విగ్రహం. కెరటాలతో పాటు వచ్చినట్లు గుర్తించి బయటకు తీశారు స్థానిక యువకులు. స్థానిక జగన్నాథస్వామి ఆలయంలో ఉంచి పూజలు చేస్తున్నారు అయ్యప్ప భక్తులు, మహిళలు. వివిధ కారణాల వల్ల సముద్ర గర్భంలో కలిసిపోయిన ఆలయాల నుంచి ఈ విగ్రహం కొట్టుకుని వచ్చినట్లు భావిస్తున్నారు స్థానిక యువకులు.

అయ్యప్ప దీక్షల సమయం కావడంతో ఈ విగ్రహానికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. చేపల కోసం వల వేస్తే అయ్యప్ప విగ్రహం వలకు తగిలింది. బరువుగా ఉండడంతో గట్టిగా లాగి ఆ విగ్రహాన్ని బయటకు తీశామని స్థానికులు తెలిపారు. ముగ్గురు మోసుకుని వచ్చి జగన్నాథ స్వామి గుడిలో పెట్టి పూజలు చేస్తున్నామన్నారు. దీనికి గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నారు. ఈ విగ్రహం లభించడం గ్రామానికి ఎంతో మేలు చేస్తుందని, శుభసూచకం వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఈ విగ్రహం ఇతర దేశాలకు చెందినదా, లేక మన దేశంలోని ఆలయానికి చెందినదా అనేది ఇంకా తేల్చాల్చి వుంది.

Read Also: Superstar Krishna: ఆయనే మన జేమ్స్‌బాండ్.. కృష్ణ మృతిపై తెలుగు సీఎంల సంతాపం

గతంలో సముద్ర తీరంలోకి ఒక ఆలయం కొట్టుకువచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో అసాని తుపాను వచ్చినప్పుడు ఇతర దేశానికి చెందిన ఓ మందిరం తీరానికి కొట్టుకువచ్చింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం సున్నాపల్లి రేవుకు చేరిన ఈ రథాన్ని బంగారు వర్ణం కలిగిన రథంగా స్థానికులు భావించారు. ఈ రథంపై 16-1-2022 అని విదేశీ భాషలో లిఖించి వుంది. ఇది మలేషియా, థాయిలాండ్, జపాన్ దేశాలకు చెందినది అయి ఉండవచ్చునని కొంతమంది మత్స్యకారులు అంటున్నారు. ఇంతవరకూ తిత్లీ వంటి పెద్ద తుపానులు వచ్చినప్పుడు కూడా ఇటువంటి విచిత్రమైన రథాలు సముద్రంలో కొట్టుకురాలేదని స్థానికులు పేర్కొన్నారు.

 

ఆ రథం మయన్మార్‌ దేశానిదని తర్వాత ప్రకటించారు. బంగారు వర్ణంతో కూడిన రథంపై విదేశీ భాష ఉండడంతో ప్రజలు ఆసక్తిగా తిలకించారు. రథంపై ఉన్న భాషను గూగుల్‌లో శోధించగా మయన్మార్‌ దేశం భాషగా తేలడంతో రథం మయన్మార్‌దిగా తేలింది. సముద్రంలో కొట్టుకుని వచ్చింది తప్ప ఇందులో విశేషం ఏమీ లేదన్నారు పోలీసులు. మరి ఇప్పుడు కొట్టుకుని వచ్చిన అయ్యప్ప విగ్రహం ఎక్కడిది అనేది త్వరలో తేలనుంది.

శ్రీకాకుళం తీరానికి కొట్టుకువచ్చిన గోల్డెన్ టెంపుల్ ఇదే