NTV Telugu Site icon

Bumper Offer : రూ.4లకే బిర్యానీ.. ఏపీలో ఎగబడ్డ జనం..

Biryani

Biryani

Bumper Offer : బిర్యానీ… ఈ మాట వినగానే నోరూరని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎలాంటి సీజన్ అయినా బిర్యానీ హవా ఎప్పుడూ యథావిధిగా ఉంటుంది. పండగలైనా, వేడుకలైనా, బిర్యానీ లేకుండా ఏనాడు పూర్తవ్వదు. పార్టీలు అయినా, ప్రత్యేక రోజులు అయినా గెస్టుల కోసం బిర్యానీ ఆర్డర్ అనేది మస్ట్ ఐటమ్ అయిపోయింది. మన భారతీయుల జీవనశైలిలో అది విడదీయలేని భాగంగా మారిపోయింది.

తాజాగా అనకాపల్లిలో ఒక హోటల్ ప్రారంభోత్సవం సందర్భంగా, నిర్వాహకులు విపరీతమైన ఆఫర్‌ను ప్రకటించారు. నూతన వ్యాపారానికి ప్రజల దృష్టి ఆకర్షించేందుకు, ప్రత్యేక ఆఫర్ రూపంలో వినూత్న ప్రయత్నం చేశారు. చికెన్ బిర్యానీ కేవలం ₹4కే! అని ప్రకటించడంతో, ఆ వార్త అందరి చెవులకూ చేరుకుంది. ఇంకేముంది, జనం ఆ హోటల్‌ దగ్గరకు గుంపులు గుంపులుగా తరలివచ్చారు.

ఒక కొత్త సినిమా టికెట్ల కోసమో, గుడి దర్శనాల కోసమో లైన్లలో నిల్చున్నట్లే ప్రజలు బిర్యానీ కోసం బారులు తీరారు. కొందరు తమ కుటుంబ సభ్యులను తీసుకొచ్చి, కొందరు చిన్న పిల్లలతో పాటు గంటలకొద్దీ వేచి ఉండిపోయారు. మరోవైపు, హోటల్‌ సమీపంలో వందలాది వాహనాలు పార్క్‌ చేయడంతో ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. జనం క్రమం తప్పుతుండడంతో, పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని సర్దుబాటు చేయాల్సి వచ్చింది.

Allu Arjun: వివాదాల వేళ.. బన్నీ ఆకాశమే నీ హద్దు.. జనసేన నేత ఆసక్తికర కామెంట్స్

అనకాపల్లిలో నర్సీపట్నం రహదారుల వద్ద భవనాల శాఖ అతిథి గృహానికి సమీపంలో హోటల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ఆఫర్‌ను ఆదివారం ప్రవేశపెట్టారు. ఒక్క వ్యక్తికి ఒక ప్యాకెట్ మాత్రమే ఇచ్చే నిబంధన పెట్టినప్పటికీ, పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. మూడు వేల మందికిపైగా బిర్యానీ ప్యాకెట్లను విక్రయించినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ ఆఫర్ ప్రభావంతో ఆ ప్రాంతమంతా రద్దీగా మారింది. వాహనాల రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్‌ సమస్య తీవ్రస్థాయికి చేరింది. పోలీసుల జోక్యంతో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరించబడింది. ఈ వినూత్న ఆఫర్‌ హోటల్‌కు విశేష ప్రచారాన్ని తెచ్చిపెట్టడంతో, నిర్వాహకుల ప్రణాళిక విజయం సాధించింది.

Zakir Hussain Death: మనమే బెస్ట్‌ అని అనుకోకూడదు.. ఎప్పుడూ విద్యార్థిగా ఉండాలి!

Show comments