Amit Shah: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమానం అత్యవసర పరిస్థితుల్లో అస్సాంలో ల్యాండ్ అయింది. అగర్తలాకు వెళ్తుండగా వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల గౌహతిలోని లోక్‌ప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దట్టమైన పొగమంచు కారణంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమానం బుధవారం రాత్రి అగర్తలలోని మహారాజా బీర్ బిక్రమ్ విమానాశ్రయంలో ల్యాండ్ కాలేదని అధికారులు తెలిపారు. విమానాన్ని గౌహతిలోని లోక్‌ప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు మళ్లించినట్లు ఏటీసీ వర్గాలు తెలిపాయి.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో అగర్తలాలోని ఎంబీబీ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. అగర్తలా ఏటీసీ నివేదించిన ప్రకారం.. దట్టమైన పొగమంచు కారణంగా దృశ్యమానత సరిగా లేనందున రాలేకపోయారని ఎస్పీ శంకర్ దేబ్‌నాథ్ తెలిపారు. ఎంబీబీ విమానాశ్రయానికి వెళ్లాల్సిన విమానం గౌహతిలో దిగిందని, ఆ రాత్రి అక్కడే బస చేస్తారని ఆయన చెప్పారు.
ఉత్తర త్రిపుర జిల్లాలోని ధర్మనగర్, దక్షిణ త్రిపుర జిల్లాలోని సబ్రూమ్ సబ్‌డివిజన్ నుంచి రథయాత్రలను ప్రారంభించడానికి అమిత్ షా గురువారం ఉదయం 11 గంటలకు అగర్తలాకు వస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీబ్ భట్టాచార్జీ తెలిపారు.”జన విశ్వాస్ యాత్ర వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ ప్రచారానికి గుర్తుగా ఉంటుంది. రెండు కార్యక్రమాలను కేంద్ర హోంమంత్రి జెండా ఊపి ప్రారంభించడం మాకు సంతోషంగా ఉంది” అని ముఖ్యమంత్రి మాణిక్ సాహా అంతకుముందు రోజు విలేకరులతో అన్నారు. అమిత్ షా మొదట ధర్మానగర్‌కు వెళతారని.. అక్కడ యాత్రను జెండా ఊపి ప్రారంభించి ర్యాలీలో ప్రసంగిస్తారని సీఎం తెలిపారు. ఆ తర్వాత సబ్రూమ్‌ని సందర్శిస్తారని, అక్కడ ఆయన మరో రథయాత్రను ప్రారంభించి, బహిరంగ ర్యాలీలో ప్రసంగిస్తారని సాహా తెలిపారు.
Selfie With Monkeys: కోతులతో సెల్ఫీ తీసుకుంటూ 500 అడుగుల లోయలో..
2018 నుంచి రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలను వెలుగులోకి తెచ్చే లక్ష్యంతో జన విశ్వాస యాత్ర నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలోని 60 అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుతూ జన విశ్వాస్ యాత్ర 1,000 కిలోమీటర్లు దాటుతుందని భట్టాచార్జీ వెల్లడించారు. జనవరి 12న ముగిసే యాత్రలో మొత్తం 100 ర్యాలీలు, రోడ్‌షోలు జరుగుతాయని, చివరి రోజు రథయాత్రలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొంటారని తెలిపారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, కేంద్రమంత్రులు సర్బానంద సోనోవాల్, కిరణ్ రిజిజు, అర్జున్ ముండా, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత సువేందు అధికారి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మిథున్ చక్రవర్తి, ఎంపీ లాకెట్ ఛటర్జీ రథయాత్రల్లో పాల్గొంటారు.