Amit Shah: దేశంలో ముస్లిం జనాభాకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం కీలక ప్రకటన చేశారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి చొరబాట్ల కారణంగా దేశంలో ముస్లిం జనాభా పెరుగుతోందని షా అన్నారు. దేశంలో ముస్లిం జనాభా 24.6 శాతం పెరిగిందని, హిందూ జనాభా 4.5 శాతం తగ్గిందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. సంతానోత్పత్తి రేటు వల్ల ముస్లిం జనాభా పెరగలేదు. చొరబాటు వల్ల పెరిగిందని స్పష్టం చేశారు. దేశం మత ప్రాతిపదికన విభజించబడిందని.. అయితే.. భారత్కు పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వైపుల నుంచి చొరబాట్లు జరిగాయని, దీని ఫలితంగా జనాభాలో ఇంత మార్పు వచ్చిందన్నారు.
ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో షా మాట్లాడారు. దేశంలో ఓటు హక్కు మన దేశ పౌరులకు మాత్రమే అందుబాటులో ఉండాలని అమిత్ షా అన్నారు. చొరబాటు, ఎన్నికల కమిషన్ కి చెందిన SIRని రాజకీయ కోణంలో చూడొద్దని విజ్ఞప్తి చేశారు. ఇది జాతీయ సమస్య అని ఆయన నొక్కి చెప్పారు. SIR అంశాన్ని కాంగ్రెస్ విమర్శిస్తుందని హోంమంత్రి అన్నారు. అలాగే చొరబాటుదారుడికి, శరణార్థికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని నొక్కి చెప్పారు. ఒక శరణార్థి తన మతాన్ని కాపాడుకోవడానికి భారతదేశానికి వస్తాడు.. కానీ.. చొరబాటుదారుడు మతపరమైన హింసను ప్రేరేపించడానికి లేదా ఆర్థిక, ఇతర కారణాల వల్ల చట్టవిరుద్ధంగా సరిహద్దు దాటి భారత్లోకి ప్రవేశిస్తాడని తెలిపారు.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్లో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పై వ్యతిరేకతలు వచ్చిన విషయం తెలిసిందే. అక్కడ దాదాపు 22 ఏళ్ల తర్వాత చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఓటరు జాబితాను అధికార ఎన్డీయేకు అనుకూలంగా మార్చుకునేందుకే ఈసీతో కలిసి బీజేపీ ఈ విధానాన్ని తీసుకువచ్చిందని సుప్రీంకోర్టుకు సైతం వెళ్లాయి. ఓట్ చోరీ జరిగిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కలిసి రాష్ట్రంలో ఓటర్ అధికార్ యాత్రను సైతం చేపట్టారు. అధికార పక్షం, ఈసీ మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించాయి. ఈ అంశాన్ని సైతం అమిత్షా ప్రస్తావించారు.