ములుగు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఏజెన్సీలో చిన్న చినుకుపడితే చాలు రోడ్లన్నీ అధ్వాన్నంగా మారిపోతాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే.. గర్భిణీలకు చాలా ప్రమాదకరం. ఎందుకంటే పురిటినొప్పులతో ఆ రోడ్లను దాటి వెళ్లడం సాధ్యం కాదు.. అంతకుమించి అక్కడికి ఏ వాహనాలు రావు. ఒకవేళ వచ్చినా, అందులో కూరుకుపోవాల్సిందే.
Read Also: Revanth Reddy Open Letter: రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ.. మీ అందరికీ ఇదే మా ఆహ్వానం
తాజాగా.. అలాంటి ఘటన ఏటూరునాగారం ఏజెన్సీలో చోటుచేసుకుంది. ఓ గర్భిణీ స్త్రీ పురిటి నొప్పులతో అవస్థలు పడుతుంటే.. ఆస్పత్రికి తరలించడానికి ఆలస్యం అయింది. దీంతో కడుపులోనే పసికందు మృతి చెందింది. ఏటూరునాగారం మండలం రాంనగర్ నుండి కమలాపురం వెళ్లే దారిలో గర్భిణీ స్త్రీని తరలిస్తున్న 108 వాహనం బురదలో కూరుకుపోయింది. దీంతో.. ట్రాక్టర్ సహాయంతో అంబులెన్స్ బయటికి తీశారు స్థానికులు.
గత రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షంతో అక్కడ రోడ్డు పనులు నిలిచిపోయాయి. దీంతో ఆ రోడ్డు బురద మయంగా మారింది. ఈ క్రమంలో కోయగూడా ఎల్లాపూర్ గ్రామనికి చెందిన ఎనిగంటి రమ్యకు పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో.. ఆసుపత్రికి తరలించడం ఆలస్యమైంది. దీంతో కడుపులో ఉన్న శిశువు ఉమ్మ నీరు మింగి మృతి చెందింది. అయితే రోడ్డు అధ్వాన్నంగా బురదమయంగా ఉండకుంటే.. అంబులెన్స్ అందులో కూరుకుపోయేది కాదని, తమ పాప బ్రతికేదని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ రెండు సంవత్సరాలు గడిచినా.. ఆ రోడ్డు పనులు పూర్తి చేయకోపోవడం వల్లే ఈ దుస్థితి అని స్థానికులు చెబుతున్నారు.
