Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులకు కష్టాలు తెచ్చిపెట్టింది. నంద్యాలలో నటుడు అల్లు అర్జున్ పర్యటన వివాదంపై ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు పడింది. ఎస్బీ కానిస్టేబుళ్లు స్వామి నాయక్ , నాగరాజు వీఆర్‌కు పంపిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈనెల 11న ఎమ్మెల్యే శిల్పారవి ఇంటికి అల్లు అర్జున్ వచ్చిన సంగతి తెలిసిందే. భారీ జన సమీకరణ జరుగుతుందని సమాచారాన్ని అందివ్వలేదని కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకున్నారు. ఈ సంఘటనపై ఎస్పీ రఘువీర్ రెడ్డి, డీఎస్పీ రవీందర్ రెడ్డి, టూ టౌన్ సీఐ రాజారెడ్డిలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ అంత మంది జనసమీకరణ చేయడంపై ఈసీ సీరియస్ అయ్యింది.
Read Also: Satyabhama Trailer: నటసింహం బాలయ్య చేతుల మీదుగా “సత్యభామ” ట్రైలర్ రిలీజ్..
ఈ నెల 11న సతీమణి స్నేహారెడ్డితో కలిసి వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లిన సంగతి తెలిసిందే. శిల్పా రవి అల్లు అర్జున్‌కు ఫ్రెండ్ కావడంతో.. ఆయనకు మద్దతు ప్రకటించేందుకు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. అయితే అల్లు అర్జున్ వస్తున్నారనే సమాచారంతో వేలాది మంది జనం అక్కడకు చేరుకున్నారు. దీంతో శిల్పా రవి ఇంటి పరిసరాలు కిక్కిరిసిపోగా.. అల్లు అర్జున్ మీద కూడ కేసు నమోదైంది. అనుమతి లేకుండా జనసమీకరణ చేశారనే కారణంతో స్థానిక రిటర్నింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అల్లు అర్జున్, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మీద పోలీసులు కేసు నమోదు చేశారు.