NTV Telugu Site icon

St Martin’s Island: షేక్ హసీనాని గద్దె దించిన ‘‘ద్వీపం’’.. అమెరికాకి సెయింట్ మార్టిన్స్‌పై ఆసక్తి ఎందుకు..?

St Martin's Island

St Martin's Island

St Martin’s Island: బంగ్లాదేశ్ అల్లర్ల వెనక అగ్రరాజ్యం కుట్ర ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని మాజీ ప్రధాని షేక్ హసీనా కూడా చెబుతోంది. బంగ్లాదేశ్ అల్లర్లు, తాను పదవి కోల్పోవడానికి అమెరికా కారణమని ఆమె ఆరోపనలు చేశారు. బంగ్లా వదిలి ఇండియాకు వెళ్లే ముందు దేశ ప్రజల్ని ఉద్దేశించి హసీనా మాట్లాడాలని అనుకున్నప్పటికీ, అక్కడి సైన్యం అందుకు అనుమతించలేదు. వీటన్నింటికి అమెరికాకు ‘సెయింట్ మార్టిన్స్’ ద్వీపాన్ని ఇవ్వకపోవడమే కారణమని ఆమె ఆరోపించినట్లు తెలుస్తోంది.

సెయింట్ మార్టిన్స్ ద్వీపం అమెరికా ఆసక్తి ఎందుకు..?

బంగాళాఖాతంలో ఈశాన్య భాగంలో ఉన్న సెయింట్ మార్టిన్స్ ద్వీపం మయన్మార్‌కి దగ్గరగా ఉంది. బంగ్లాదేశ్ కాక్స్ బజార్-టెక్నాఫ్ కొనకు దక్షిణాన దాదాపు 9 కి.మీ దూరంలో ఈ చిన్న పగడపు దీవి ఉంది. ఇది ఆ దేశానికి చెందిన ఏకైక పగడపు దీవి. ఈ ద్వీపం మొత్తం 3 చ.కి.మీ వైశాల్యాన్ని కలిగి ఉంది. దాదాపుగా 3700 మంది నివాసితులు ఉన్నారు. ఇక్కడ నుంచి చేపల్ని, కొబ్బరి, వరిని మయన్మార్‌కి ఎగుమతి చేస్తుంటారు.

బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్‌పీ) చీఫ్ ఖలీదా జియాకు ఎన్నికల్లో గెలిచేందుకు సాయం చేస్తే, ఈ ద్వీపాన్ని అమెరికా సైనిక స్థావరానికి విక్రయించాలని యోచిస్తున్నట్లు కథనాలు ఉన్నాయి. ఇది సైనికపరంగా వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది. చైనా, భారత్, మయన్మార్ ఇలా పలు దేశాలకు దగ్గరగా ఉంది. అందుకు అమెరికా దీనిపై కన్నేసినట్లు తెలుస్తోంది. అయితే, అమెరికా ఒత్తిడికి లొంగకుండా ఈ దీవిని ఇవ్వనందుకే తనను గద్దె దింపారని షేక్ హసీనా ఆరోపిస్తోంది. ఈ దీవిని అమెరికాకి లీజుకు ఇచ్చి ఉంటే తాను అధికారంలో ఉండేదానినని చెప్పినట్లు సమచారం. అయితే, అమెరికా మాత్రం ఈ ఆరోపణల్ని ఖండిస్తోంది. చైనాను కౌంటర్ చేయడానికి అమెరికా కూడా ఈ ప్రాంతంలో తన బలాన్ని పెంచుకునేందుకు బంగాళా ఖాతంలోని సెయింట్ మార్టిన్స్ ద్వీపాన్ని కోరినట్లు నిపుణులు చెబుతున్నారు.

Read Also: Himachal Pradesh: శుభకార్యానికి వెళ్తుండగా ప్రమాదం.. కారు వాగులో కొట్టుకుపోయి 11 మంది మృతి

ద్వీప చరిత్ర:

ఈ ద్వీపాన్ని బెంగాలీలో ‘ నారికేల్ జింజిరా’ లేదా కొబ్బరి ద్వీపం అని పిలుస్తారు. ఒకప్పుడు ఇది టెక్నాఫ్ ద్వీపకల్పంలో భాగంగా ఉండేది. కొంత భాగం మునిగిపోవడంతో ద్వీపంగా మారింది. 18వ శతాబ్ధంలో దీనికి అరేబియా వ్యాపారులు ‘జజీరా’ అనే పేరు పెట్టారు. 1900లో బ్రిటీష్ ల్యాండ్ సర్వే ఈ ద్వీపాన్ని బ్రిటిష్ ఇండియాలో భాగంగా చేశారు. దీనికి సెయింట్ మార్టిన్ అనే క్రైస్తవ మతగురువు పేరు పెట్టారు. 1937లో మయన్మార్ విడిపోయిన తర్వాత కూడా ఈ దీవి బ్రిటీష్ ఇండియాలో భాగంగానే ఉంది. 1947 దేశ విభజన తర్వాత పాకిస్తాన్ ఆధీనంలోకి వెళ్లింది. 971 విముక్తి యుద్ధం తర్వాత పగడపు ద్వీపం బంగ్లాదేశ్‌లో భాగమైంది. 1974లో ఈ ద్వీపం బంగ్లాదేశ్‌దే అని మయన్మార్‌తో ఒప్పందం జరిగింది.

ఈ ద్వీపం మయన్మార్‌కి సమీపంలో ఉండటంతో తరుచూ బంగ్లాదేశ్ జాలర్లని మయన్మార్ నిర్భందించడం వివాదంగా మారింది. ఈ ప్రాంతంలో సముద్ర జలాలపై ఆధిపత్యంపై ఇరు దేశాల మధ్య సమస్యలు ఉన్నాయి. 2012లో, ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ది లా ఆఫ్ ది సీ (ITLOS), ఒక మైలురాయి తీర్పులో, పగడపు ద్వీపంపై బంగ్లాదేశ్ సార్వభౌమాధికారాన్ని ధృవీకరించింది. దీంతో బంగ్లాదేశ్ ప్రాదేశిక జలాలు, స్పెషల్ ఎకనామిక్ జోన్(EEZ)పై అధికారం లభించింది.