Tenali: వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీడీపీ-జనసేన కలిసి ముందుకు సాగుతున్నాయి.. అయితే, సీట్ల సర్దుబాటు కొన్ని స్థానాల్లో చిచ్చుపెట్టేలా కనిపిస్తోంది.. ఇప్పటి వరకు సీట్ల కేటాయింపుపై ఎలాంటి ప్రకటన రాకపోయినా.. ఫలానా సీటు టీడీపీకి, ఆ సీటు జనసేనకు అనే ప్రచారం మాత్రం జరుగుతోంది.. మరోవైపు తెనాలి సీటు జనసేన పార్టీకే కేటాయిస్తారనే చర్చ సాగుతోంది.. తెనాలిలో మారుతున్న పరిణామాల నేపథ్యంలో టీడీపీ రెబల్ గా బరిలోకి దిగేందుకు మాజీ మంత్రి ఆలపాటి రాజా సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.. గుంటూరు విద్యా నగర్ లో మాజీ మంత్రి ఆలపాటి రాజా అనుచరులు సమావేశం అయ్యారు.. తెనాలి సీటు జనసేనకు కేటాయిస్తారన్న ప్రచారంతో తాము రాజీనామాలు చేస్తామంటూ ఆలపాటిని కలిశారు టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు..
Read Also: MLA Vasupalli Ganesh Kumar: వివాదంలో వైసీపీ ఎమ్మెల్యే..! కళాశాలలో మద్యం, కోళ్లు పంపిణీ..
అయితే, ద్వితీయ శ్రేణి నాయకులతో సమావేశమైన ఆలపాటి రాజా.. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దామని సర్ది చెప్పారు.. టీడీపీ శ్రేణులకు అన్యాయం జరిగేలా ఉంటే తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని కార్యకర్తలతో చెప్పారట ఆలపాటి రాజా.. మరోవైపు.. తెనాలిలో టీడీపీకి సీటు ఇవ్వకపోతే పార్టీ తీవ్రంగా నష్టపోతుంది.. అలాంటి ఎన్నికల్లో మేం పనిచేయడం కూడా అనవసరం అంటున్నాయి టీడీపీ శ్రేణులు.. రాజాకు సీటు కేటాయించకపోతే కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు.. ఇలా అంతా రాజీనామాల బాట పడతాం అని హెచ్చరిస్తు్న్నారు. పొత్తు గెలుపు కోసం ఉండాలి, కానీ, వ్యక్తిగత స్వార్థం కోసం ఉండకూడదని హితవుపలికారు. తెనాలిలో గెలుపు సాధించే వారికే సీటు ఇవ్వాలి అని టీడీపీ శ్రేణులు చెబుతున్నమాట.