ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు కుంచుకోటలుగా ఉన్న రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలపై ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఇందుకు ఈ స్థానాల్లో ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించకపోవడమే కారణం. ఇప్పటి వరకు ఆయా రాష్ట్రాల్లో అభ్యర్థుల్ని ప్రకటించాయి. కానీ రాయ్‌బరేలీ, అమేథీ సీట్లకు మాత్రం అభ్యర్థుల్ని ఖరారు చేయలేకపోయారు. దీంతో రకరకాలైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అమేథీ నుంచి సోనియా అల్లుడు, ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా పోటీ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఏకే. ఆంటోనీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నియోజకవర్గాలతో నెహ్రూ, గాంధీ కుటుంబాలకు విడదీయరాని సంబంధం ఉందని తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి గాంధీ కుటుంబ సభ్యులు బరిలో ఉంటారని ఆయన స్పష్టం చేశారు.
అమేథీ, రాయ్‌బరేలీ సీట్లపై నిర్ణయం వచ్చేంత వరకు ఎదురుచూడాలని.. అప్పటివరకు ఎలాంటి ఊహాగానాలు వద్దని ఆయన తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి గాంధీ కుటుంబ సభ్యులు పోటీ చేస్తారని ఓ మీడియా ఛానల్‌కు ఆంటోనీ వెల్లడించారు. రాబర్ట్ వాద్రా కూడా బరిలో ఉండే అవకాశం ఉందని వస్తున్న ఊహాగానాలపై ప్రశ్నించగా.. అలా జరగకపోవచ్చు అని ఆయన బదులిచ్చారు. ప్రియాంక లేదా రాహుల్ గాంధీ యూపీ నుంచి పోటీ చేస్తారని పేర్కొన్నారు. రాహుల్ ఇప్పటికే కేరళలోని వయనాడ్ నుంచి బరిలోకి దిగారు.
2019 ఎన్నికల్లో అమేథీలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఘోరంగా ఓడిపోయారు. దాదాపు 55 వేల ఓట్లతో పరాజయం చెందారు. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో మాత్రం రాహుల్ పేరును వెల్లడించలేదు. వయనాడ్‌లోనే నామినేషన్ దాఖలు చేశారు. పైగా ఇండియా కూటమి పొత్తులో ఈ అమేథీ కాంగ్రెస్‌కే దక్కింది. కానీ రాహుల్ పేరును మాత్రం ప్రకటించలేదు. అయితే వయనాడ్ పోలింగ్ ముగిశాక.. దీనిపై ఒక క్లారిటీ వస్తుందని.. రాహుల్ పోటీ చేయాలా? వద్దా? అన్నదానిపై అప్పుడే నిర్ణయం తీసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈసారి సోనియాగాంధీ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. దీంతో రాయ్‌బరేలీ నుంచి ప్రియాంకాగాంధీ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పటివరకూ కాంగ్రెస్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో రాహుల్ , ప్రియాంకలో ఎవరు.. ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే ఏప్రిల్ 26 వరకు ఆగల్సిందే. వయనాడ్ పోలింగ్ ముగిసేది ఆరోజే.