సౌతాఫ్రికా ఆటగాడు ఐడెన్ మార్క్రామ్ రికార్డు సృష్టించాడు. ప్రపంచకప్లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన ఆటగాడిగా చరిత్రలోకెక్కాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా.. శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో మార్క్రామ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. శ్రీలంక బౌలర్లను చీల్చిచండాడు. దీంతో వన్డే ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసి దక్షిణాఫ్రికా ఆటగాడు ఐడెన్ మార్క్రామ్ చరిత్ర సృష్టించాడు. కేవలం 49 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు.
Read Also: ICC Cricket World Cup 2023: రికార్డులు అన్నీ బద్దలు కొట్టిన సౌతాఫ్రికా..
మార్క్రామ్ 196.30 స్ట్రైక్ రేట్ వద్ద 54 బంతుల్లో 106 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. మార్క్రామ్ నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి.. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి దూకుడుగా కనిపించాడు. అతని బ్యాటింగ్ ప్రదర్శన ముందు శ్రీలంక బౌలర్లు పూర్తిగా నిస్సహాయంగా కనిపించారు.
Read Also: Asian Games 2023: భారత్కు పతకాల పంట.. కబడ్డీలో గోల్డ్ మెడల్ సాధించిన ఇండియా
ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ కూడా ఉన్నాడు. 2015 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌పై డివిలియర్స్ 52 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. డివిలియర్స్ గతంలో ఈ జాబితాలో మూడో స్థానంలో ఉండగా.. ఇప్పుడు నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఇదిలా ఉంటే.. శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మూడు సెంచరీలు చేయడం గమనార్హం. ఐడెన్ మార్క్రామ్‌తో పాటు క్వింటన్ డి కాక్, రాస్సీ వాన్ డెర్ డ్యూసెన్ సెంచరీలు సాధించారు.