NTV Telugu Site icon

Bhatti Vikramarka : ఏఐసీసీ డ్రాఫ్టింగ్ కమిటీలో భట్టి విక్రమార్కకు కీలక పాత్ర

Bhatti Vikramaraka

Bhatti Vikramaraka

Bhatti Vikramarka : ఏప్రిల్ 8, 9 తేదీల్లో గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ (ఏఐసీసీ) కీలక సమావేశాలు నిర్వహించనుంది. ఈ సమావేశాల్లో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, వ్యూహాలు, విధానాల రూపకల్పనతో పాటు రాజకీయ నిర్ణయాలపై కీలక చర్చలు జరగనున్నాయి. ఇందులో డ్రాఫ్టింగ్ కమిటీ ప్రధాన భూమికను పోషించనుంది. ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో 15 మంది సభ్యులు ఉంటారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరియు జనరల్ సెక్రటరీ కే.సి. వేణుగోపాల్ ఈ నెల 24న కమిటీ సభ్యుల పేర్లను అధికారికంగా ప్రకటించారు. ఈ కమిటీలో తెలుగురాష్ట్రాల నుంచి తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లుకు స్థానం దక్కడం గర్వించదగిన విషయం. పార్టీ పట్ల ఆయన నిబద్ధత, రాజకీయ నైపుణ్యం, అనుభవం, విజ్ఞానసంపత్తి కారణంగా ఈ ప్రథమశ్రేణి కమిటీలో చోటు లభించింది.

డ్రాఫ్టింగ్ కమిటీ తొలి సమావేశం శుక్రవారం సాయంత్రం న్యూఢిల్లీ అక్బర్ రోడ్డులోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఏప్రిల్ 8న జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశానికి ముందు, ఏప్రిల్ 9న ఏఐసీసీ ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహించనున్నారు.

ఈ సమావేశాలు గతేడాది డిసెంబర్‌లో కర్ణాటక రాష్ట్రం బెలగావిలో జరిగిన “నవ సత్యాగ్రహం” సమావేశ నిర్ణయాలకు అనుగుణంగా ఉంటాయని ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. పార్టీ రాబోయే ఎన్నికలకు సంబంధించి మ్యానిఫెస్టో రూపొందించడం, పార్టీ సంస్థాగత మార్పులు, వ్యూహాత్మక నిర్ణయాలు, కాంగ్రెస్ సిద్ధాంతాలను మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు.

2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భట్టి విక్రమార్క ముఖ్యమైన పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో ఆయన చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర అత్యంత ప్రభావశీలంగా నిలిచింది. ఆ సమయంలో సీఎల్పీ నేతగా ఆయన కృషి తెలంగాణలో కాంగ్రెస్ విజయానికి పునాది వేసింది.

ఇంకా, జార్ఖండ్ 2024 శాసనసభ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయాన్ని సునిశ్చితంగా మార్చడంలో కూడా భట్టి విక్రమార్క కీలకంగా వ్యవహరించారు. రాష్ట్రస్థాయిలోనే కాకుండా జాతీయస్థాయిలోనూ ఆయన వ్యవహారదక్షత, నాయకత్వ నైపుణ్యం పార్లమెంటరీ రాజకీయాల్లో ప్రభావం చూపిస్తున్నది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ డ్రాఫ్టింగ్ కమిటీలో భట్టి విక్రమార్క స్థానం దక్కించుకోవడం, దేశవ్యాప్తంగా పార్టీ విధానాల రూపకల్పనలో కీలకంగా మారడం రాజకీయ పరంగా ఆయనకు మరో కీలక మైలురాయి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Aman Sweets : మల్లాపూర్ అమన్ స్వీట్స్ ఫ్యాక్టరీ సీజ్.. గడువు ముగిసిన స్వీట్లతో మళ్లీ తయారీ!