టీమ్ ఇండియా యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ జింబాబ్వేతో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన వైభవ్, తన వినూత్న మైదాన సంబరాల వెనుక ఉన్న అసలు రహస్యాన్ని వెల్లడించాడు. వైభవ్ తన అర్ధశతకం పూర్తయిన తర్వాత చేతి వేళ్లతో ‘A’ గుర్తును, ఆ తర్వాత ‘థంబ్స్ అప్’ సింబల్‌ను చూపించాడు. ఐపీఎల్‌లో కూడా ఈ ‘A’ జెస్టర్‌తో కనిపించిన వైభవ్, దీని వెనుక ఉన్న కారణాన్ని బీసీసీఐ పంచుకున్న వీడియోలో వివరించాడు. ‘A’ గుర్తు తన తల్లి ఆర్తి సూర్యవంశీకి అంకితమని, తన విజయంలో ఆమె పాత్రను గౌరవిస్తూ తల్లి పేరులోని మొదటి అక్షరాన్ని ఇలా చూపిస్తానని తెలిపాడు. ఇక ‘థంబ్స్ అప్’ సంబరం సహచర ఆటగాడు రింకూ సింగ్ ఇచ్చే సలహాలు, వారద్దరి మధ్య జరిగిన సంభాషణకు గుర్తుగా చేసినట్లు వెల్లడించాడు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌ను తన కుటుంబానికి, కోచ్‌కు మరియు కష్టకాలంలో తనకు తోడుగా నిలిచిన మిత్రులకు అంకితమిచ్చాడు.
ఇంగ్లాండ్ పర్యటనలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన వైభవ్, హరారే మైదానంలో మాత్రం తన సత్తా చాటాడు. గతంలో అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లాండ్‌పై 80 బంతుల్లోనే 175 పరుగులు చేసిన జ్ఞాపకాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు. ఈ గ్రౌండ్‌లో ఆడటం తనకు ఎంతో ఇష్టమని, అయితే దేన్నీ తేలిగ్గా తీసుకోకుండా జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించడానికే ప్రాధాన్యమిస్తానని పేర్కొన్నాడు.
జూలై 25, 26 తేదీల్లో జరిగే తదుపరి మ్యాచ్‌లలో వైభవ్ సూర్యవంశీ తన అంతర్జాతీయ కెరీర్‌లో తొలి శతకం నమోదు చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే ఐపీఎల్‌లో 32 బంతుల్లో సెంచరీ బాదిన ఈ సంచలన బ్యాటర్ నుంచి మరో మెరుపు ఇన్నింగ్స్ వస్తుందేమో వేచి చూడాలి.

