దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే సురీడు సుర్రుమంటున్నాడు. ఇంట్లో నుంచి కాలు బయటపెట్టాలంటేనే జనాలు హడలెత్తిపోతున్నారు. భానుడు భగభగమండిపోతున్నాడు. ఇంకోవైపు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. మరోవైపు ఐఎండీ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. జూన్ వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది.
ప్రజల భద్రత కోసం ఆరోగ్య మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. ఈ వేసవిలో వేడి తరంగాల నుంచి ఉత్పన్నమయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలి? వాటి కారణంగా ప్రజలు అనారోగ్య బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలపై చర్చించేందుకు గాను కేంద్ర ఆరోగ్య మంత్రి డా. మన్సుఖ్ మాండవియా గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నీతి ఆయోగ్‌తో పాటు పలువురు ప్రముఖ వైద్యులు, ఇతర నిపుణులు హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రజల కోసం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఈ విధంగా చేయండి
ఎల్లప్పుడూ హైడ్రేడెట్‌గా ఉండాలి.
సమయానుకూలంగా నీళ్లు తాగుతూ ఉండాలి.
సూర్యకాంతి పడకుండా చూసుకోవాలి
మధ్యాహ్నం 12-4 గంటల మధ్య ఇంట్లోనే ఉండాలి
చేయకూడనవి..
మండుటెంటల్లో ఎటువంటి కార్యకలాపాలు చేపట్టకూడదు.
మధ్యాహ్నం 2-4 గంటల మధ్య వంట చేయడం మానుకోవాలి.
వాహనాల్లో పిల్లలు, పెంపుడు జంతువులను ఎక్కువసేపు ఉంచొద్దు.
మద్యపానం, టీ, కాఫీ, చక్కెర పానీయాలు, డ్రింక్స్‌ని మానుకోవాలి.
చెప్పులు లేదా షూస్ లేకుండా బయట ఏమాత్రం తిరగకూడదు.
ఇంటిని ఎల్లప్పుడూ చల్లగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలని.. ఇందుకోసం కర్టెన్లు, షట్టర్స్, సన్‌షేడ్స్‌ని వినియోగించాలని పేర్కొంది. రాత్రి సమయంలో కిటికీలను తెరిచి ఉంచితే శ్రేయస్కరమని అధికారులు చెబుతున్నారు. పగటిపూట దిగువ అంతస్తుల్లో ఉండటానికి ప్రయత్నించాలి. శరీరాన్ని చల్లబరచుకోవడం కోసం.. ఫ్యాన్, తడి బట్టలు ఉపయోగించాలని ఆరోగ్య శాఖ సలహా ఇచ్చింది.