తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్స్ ముగిసిపోగా ఈ నెల 22న ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థులు, వార్డ్స్ మెంబర్స్ ఆయా గ్రామాల్లో బాధ్యతలు స్వీకరించారు. దీంతో పల్లెల్లో కొత్త పాలకమండళ్లు కొలువుదీరాయి. అయితే స్థానిక ఎలక్షన్స్ ముగిసినప్పటికీ పలు గ్రామాల్లో గొడవలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల్లో గెలిచిన వారికి, ఓడిపోయిన వారికి మధ్య గొడవలుతలెత్తుతున్నాయి. ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్నారు. మరికొందరు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి ఆర్థికంగా నష్టపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాపోతున్నారు. కాగా తాజాగా మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.
Also Read:Vijay Hazare Trophy 2025-26: విజయ్ హజారే ట్రోఫీ.. రో-కోల మ్యాచ్ ఫీజ్ ఎంతో తెలుసా?
తన తల్లి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడంతో మనస్తాపానికి గురై కొడుకు పురుగుల మందు తాగాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి మృతిచెందాడు. బయ్యారం మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన చింత సునీల్ (25) తల్లి వెంకటరమణ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది. ఆమె కొడుకు సునీల్ తల్లి ఓటమిని జీర్ణించుకోలేకపోయాడు. తీవ్ర వేదనతో పురుగుల మందు తాగాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు. సునీల్ మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.