అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టు అంతర్జాతీయ వేదికపై మరో చారిత్రాత్మక ఘనతను సాధించింది. ఐసీసీ పురుషుల వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్థాన్ తమ అత్యుత్తమ ర్యాంక్‌ను కైవసం చేసుకుని 6వ స్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు ఆరో స్థానంలో ఉన్న శ్రీలంకను అధిగమించి ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 2009లో అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేసిన అఫ్గానిస్థాన్, చాలా తక్కువ కాలంలోనే ప్రపంచ క్రికెట్లో బలమైన జట్టుగా ఎదుగుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
గడిచిన కొన్నేళ్లుగా అఫ్గానిస్థాన్ జట్టు అన్ని ఫార్మాట్లలోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తోంది. 2023లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్, శ్రీలంక వంటి మాజీ ఛాంపియన్లను ఓడించడమే కాకుండా, 2024లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఏకంగా సెమీఫైనల్ చేరి చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఆడిన 191 వన్డే మ్యాచ్‌ల్లో అఫ్గానిస్థాన్ 96 విజయాలు సాధించింది.
వెస్టిండీస్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ వంటి దిగ్గజ జట్ల కంటే ముందే ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానంలో ఉన్న అఫ్గానిస్థాన్, ఇప్పుడు శ్రీలంకను కూడా వెనక్కి నెట్టి ఆరో స్థానానికి ఎగబాకింది. ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 4-0తో గెలుచుకోవడంతో పాటు, జింబాబ్వే, బంగ్లాదేశ్‌లతో జరిగిన ట్రై-సిరీస్‌లో ఓటమి లేకుండా విజేతగా నిలవడం ఈ ర్యాంకింగ్స్‌లో కలిసి వచ్చింది.
అంతేకాకుండా.. జింబాబ్వేపై జరిగిన టీ20 సిరీస్‌ను కూడా క్లీన్ స్వీప్ చేసి అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఇప్పుడు జింబాబ్వేతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సిద్ధమవుతోంది. క్రమశిక్షణ, అంకితభావంతో ఆడుతూ పటిష్టమైన జట్లకు సవాలు విసురుతున్న అఫ్గానిస్థాన్ జట్టు సాధించిన ఈ ఆరో ర్యాంక్, ఆ దేశ క్రికెట్ చరిత్రలోనే ఒక కీలక మైలురాయిగా నిలిచిపోతుంది.

