రాజకీయపార్టీలకు విరాళాలు సునామీలా వచ్చిపడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలకు 2021-2022లో భారీగా విరాళాలు వచ్చాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తెలిపింది. దేశంలోని 26 ప్రాంతీయ పార్టీలకు వచ్చిన విరాళాలతో పోలిస్తే 2021-22లో టీఆర్ఎస్ అగ్రస్థానంలో ఉండగా, వైసీపీ ఐదో స్థానంలో ఉంది. టీఆర్ఎస్ కు రూ.40.90 కోట్లు, వైసీపీకి రూ.20 కోట్లు వచ్చి నట్టు ఎన్నికల సంస్కరణల సంస్థ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. 2020-21తో పోలిస్తే ఆ మరుసటి సంవత్సరం ఈ రెండు పార్టీలకు ఎక్కువగా విరాళాలు వచ్చినట్టు పేర్కొంది.
Read Also: Cricket LIVE : తగ్గేదేలే…ఇప్పటికీ నువ్వే మా హీరో
2021-22లో వచ్చిన విరాళాలపై ప్రాంతీయ పార్టీలు ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాలను ఏడీఆర్ సోమవారం వెల్లడించింది. దేశంలోని 26 ప్రాంతీయ పార్టీలకు మొత్తం 189 కోట్లు విరాళాలు రాగా.. అందులో 85.46 శాతం అంటే 162.21 కోట్లు టీఆర్ఎస్, ఆప్, జేడీయూ, ఎస్పీ, వైసీపీకే వచ్చాయి. 20 వేలలోపు, అంతకంటే ఎక్కువ విరాళాల వివరాలను ఏడీఆర్ వెల్లడించింది.
ఈ మొత్తం విరాళాల్లో రూ.7.40 లక్షలు మాత్రమే (0.039 శాతం) నగదు రూపంలో వచ్చింది. టీఆర్ఎస్ కు కేవలం 14 విరాళాల్లో 40.90 కోట్ల రూపాయలు వచ్చాయి. 2020-21లో కంటే 2021-22లో వైసీపీకి 8,00,300 శాతం విరాళాలు ఎక్కువగా వచ్చాయి, అంతకుముందు 2019-20 సంవత్సరంలో 25 ప్రాంతీయ పార్టీలకు మొత్తం రూ.803.24 కోట్ల ఆదాయం రాగా… ఇందులో రూ.445.77 కోట్లు (55.50%) తెలియని మార్గాల నుంచి వచ్చాయని ఆయా పార్టీలు చూపించాయి. మరో రూ.357.47 కోట్లు (44.60%) ఇచ్చిన వారి వివరాలు మాత్రం పేర్కొన్నాయి. తెలియని మార్గాల నుంచి విరాళాల్లో టీఆర్ఎస్‌కు దేశంలోనే అత్యధికంగా రూ.89.158 కోట్లు రాగా.. టీడీపీ రూ.81.694 కోట్లు, వైసీపీ రూ.74.75 కోట్లతో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాతి స్థానాల్లో బిజూ జనతాదళ్ (రూ.50.58 కోట్లు), డీఎంకే (రూ.45.5 కోట్లు), శివసేన(రూ.42.79కోట్లు), జేడీ(ఎస్) (రూ.18.55 కోట్లు), జేడీయూ (రూ.13.04కోట్లు), ఎస్పీ (రూ.10.84 కోట్లు) ఉన్నాయి.
Read Also: Kesavananda Bharati Case: కేశవానంద భారతి కేసుకు 50 ఏళ్లు