Adilabad: ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి ఎస్‌ఎన్‌సీయూ వార్డులో సోమవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆసుపత్రిలోని స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్ (ఎస్ఎన్‌సీయూ)లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. కొద్దిసేపట్లోనే వార్డు మొత్తం దట్టమైన పొగ, అగ్నికీలలతో నిండిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు నవజాత శిశువులు మృతి చెందారు. ఇదే వార్డులోని మరో 28 మంది చిన్నారులను సురక్షితంగా బయటకు తరలించడంతో పెను ప్రమాదం తప్పింది. ఎయిర్ కండిషనర్ (ఏసీ)లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ దురదృష్టకర ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి దర్యాప్తు తరువాతే ప్రమాదానికి కారణమైన వివరాలను తెలియజేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇక ఈ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు.
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి ఎస్‌ఎన్‌సీయూ వార్డులో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఘటనకు దారితీసిన కారణాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని ఆసుపత్రుల్లో భద్రతా చర్యలను పటిష్టం చేయాలని సీఎం ఆదేశించారు. మరోవైపు, అగ్ని ప్రమాద ఘటనపై ఉన్నతాధికారులతో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాదంలో చిన్నారి మృతి చెందడం పట్ల మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నారి కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని మంత్రి ప్రార్థించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ఘటనా సమయంలో వార్డులో ఉన్న మిగిలిన చిన్నారులందరి పరిస్థితి నిలకడగా ఉందని, ఎవరికీ సమస్య లేదని అధికారులు మంత్రికి వివరించారు. పిల్లలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి సూచించారు. అగ్ని ప్రమాదానికి గల కారణంపై తక్షణమే విచారణ మొదలు పెట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

