రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రవీణ్ రిమ్స్‌లో పీజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. నిన్న (ఆదివారం) కావడంతో తొమ్మిది మంది స్నేహితులతో కలిసి ఆదిలాబాద్ వినాయక్ చౌక్ నుంచి ఆదిలాబాద్ రూరల్ మండలం మీదుగా శివ్‌ఘాట్ కు వెళ్లారు. పక్కనే ఉన్న సాత్నాల వాగు దగ్గర కోటి లింగాలను దర్శించుకున్నారు. అనంతరం వాగు అందాలను సెల్ఫీ తీసుకుంటుండగా.. ప్రవీణ్ ఫోన్ వాగులో పడిపోయింది. దాని కోసం అందులోకి ప్రవీణ్ దిగి.. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు.
Read Also: Income Tax Return: 2019తో పోలిస్తే కోటీశ్వరులు 50శాతం పెరిగారు.. 4.65కోట్ల మంది కట్టిన పన్ను సున్నా
అయితే, అతడిని కాపాడేందుకు మరో ఇద్దరు స్నేహితులు వాగులోకి దిగగా ఉక్కిరిబిక్కిరి కావడంతో బయటకు వచ్చేశాడు. దీంతో స్థానికుల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇక గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చీకటి పడటంతో గాలింపు చర్యలు కష్టంగా మారినట్లు పోలీసులు తెలిపారు. నేడు మళ్లీ ఐదుగురు గజ ఈతగాళ్ల సహాయంతో అన్వేషణ చేయగా.. ప్రవీణ్ మృతదేహం దొరికింది. వాగులో నుంచి బయటకు తీసి పోలీసులకు అప్పగించారు.
Read Also: Tomoto Van: బోల్తాపడ్డ టమాటా వ్యాన్.. దోపిడీకి దిగిన ప్రజలు
కాగా.. సిరిసిల్లా జిల్లాకు చెందిన తల్లిదండ్రులకు పోలీసులు ప్రవీణ్ గల్లంతు అయినట్లు సమాచారం తెలియజేశారు. ప్రవీణ్ కుటుంబసభ్యులు, బంధువులు వాగువద్దకు చేరుకొని కొడుకు మృతదేహం చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి కుటుంబానికి భరోసానిస్తాడని అనుకున్నాం.. కానీ ఇలా ప్రాణాలు పోగొట్టుకుంటాడు అనుకోలేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా ప్రవీణును కాపాడేందుకు ప్రయత్నించిన స్నేహితుల్లో ఒకరైన కార్తీక్ అస్వస్థతకు గురికావడంతో రిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. ప్రవీణ్ తప్ప మిగిలిన ఎనిమిది మంది సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇక ప్రవీణ్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.