Site icon NTV Telugu

Crime News: ఉచిత సలహా ఇచ్చి.. బంగారు ఆభరణాలను అపహరించిన నకిలీ పోలీసులు!

Fake Police Gold

Fake Police Gold

ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో దోపిడీ కలకలం రేపింది. కొందరు దుండగులు పోలీసుల పేరుతో రోడ్డుపై ఇద్దరు దంపతుల బైక్ ఆపి.. ఉచిత సలహా ఇచ్చి బంగారు ఆభరణాలను అపహరించారు. మోసపోయామని తెలుసుకున్న ఆ దంపతులు బేల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దుండగులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

కౌట గ్రామానికి చెందిన సంతోష్, వందనలు తమ ద్విచక్ర వాహనంపై మాంగ్రూడ్ గ్రామం వెళ్లి తిరుగు పయనం అయ్యారు. పాఠన్ సమీపంలో రహదారిపై ఇద్దరు వ్యక్తులు వీరిని ఆపారు. తాము పోలీసులమని, ముందు ఓ హత్య జరిగిందని చెప్పారు. మెడలో బంగారాన్ని తీసి కవర్లో పెట్టుకొని వెళ్లమని సలహా ఇచ్చారు. దుండగులు చెప్పిన మాట విన్న వందన.. తన మెడలో బంగారాన్ని తీసింది. బంగారాన్ని తాము కవర్లో పెట్టి ఇస్తామని దుండగులు చెప్పగా.. వారి చేతికి ఇచ్చింది. గులక రాళ్ల కవర్ వందనకు ఇచ్చి.. బంగారు ఆభరణాలతో దొంగలు పరార్ అయ్యారు.

ఇది గమనించిన సంతోష్, వందన దంపతులు తాము మోసపోయామని గ్రహించారు. లబోదిబో అంటూ బేల పోలీస్ స్టేషన్‌కు పరుగెత్తారు. రెండు బైక్‌లపై నలుగురు మాటు వేసి.. పోలీసుల పేరుతో మోసం చేశారని బాధితురాలు పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఘటన జరిగిన ప్రాంతంను పోలీసులు పరిశీలించారు. చుట్టుపక్కల ఉన్న కెమెరాల ఆధారంగా దుండగులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

Exit mobile version