Meenakshi Seshadri About Re Entry: 90వ దశకంలో సూపర్‌హిట్ కథానాయికలలో ‘మీనాక్షి శేషాద్రి’ ఒకరు. ‘దామిని’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి.. అప్పటి బాలీవుడ్ స్టార్ హీరోలందరితో కలిసి నటించారు. ఇక 1991లో ‘బ్రహ్మశ్రీ విశ్వామిత్ర’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి.. చిరంజీవి హీరోగా 1992లో వచ్చిన ‘ఆపద్బాంధవుడు’తో మరింత దగ్గరయ్యారు. మీనాక్షి తన 13 ఏళ్ల కెరీర్‌లో 70 సినిమాల్లో నటించారు. కెరీర్ మంచి ఊపులో ఉండగానే.. 1995లో హరీష్ మైసూర్‌ను పెళ్లి చేసుకుని విదేశాల్లో స్థిరపడ్డారు.
2016లో విడుదలైన ‘గాయల్ వన్స్ అగైన్’లో మీనాక్షి శేషాద్రి అతిథి పాత్రలో కనిపించారు. దాదాపు ఎనిమిదేళ్ల నుంచి వెండితెరకు దూరంగా ఉన్న మీనాక్షి.. 60 ఏళ్ల వయసులోనూ కమ్‌బ్యాక్ ఇవ్వడానికి సిద్దమయ్యారు. తాజాగా లెహరెన్ రెట్రోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సీనియర్ నటి చాలా విషయాలపై స్పందించారు. కమ్‌బ్యాక్ ఇవ్వడానికి సిద్దమయ్యానని, మంచి పాత్రల కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు. తనకోసం స్క్రిప్ట్ రాయాలని నిర్ణయించుకునే ముందు.. ఈ రోజుల్లో తాను ఎలా ఉన్నానో, ఎలాంటి పాత్రకు సెట్ అవుతానో అని తెలుసుకోవాలన్నారు.
Also Read: Keerthy Suresh: ఆ విషయంలో అత్యధిక ట్రోల్స్ ఎదుర్కొన్న నటిని నేనే: కీర్తి సురేశ్
హీరోల సుదీర్ఘ కెరీర్‌కు కారణం ఏంటో మీనాక్షి శేషాద్రి వివరించారు. ‘ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్‌తో పాటు ఆ తరానికి చెందిన నటులు ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. కథానాయికలతో పోలిస్తే హీరోలకు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కెరీర్ ఉండటానికి చాలా కారణాలున్నాయి. ఇంటి పనులు చేసేది పురుషులు కాదు. ప్రెగ్నెన్సీ, పిల్లలకు జన్మనివ్వడం, పిల్లలను పెంచడం వంటి విషయాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇవన్నీ స్త్రీ బాధ్యతలు. హీరోలకు ఎంత వయసు వచ్చినా తెరపై చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు’ అని మీనాక్షి పేర్కొన్నారు.