Jamuna Memories: మొన్ననే కేంద్రం ‘పద్మ’ అవార్డులను ప్రకటించినప్పుడు నాటి అందాలతార, మేటి నటి జమునకు ఇప్పటి దాకా ఎందుకని ‘పద్మ’ పురస్కారం లభించలేదన్న చర్చ తెలుగుసినిమా జనాల్లో చోటుచేసుకుంది. ఆ చర్చ ఇంకా ముగింపు రాకుండానే మహానటి జమున కన్నుమూశారన్న వార్త ఆమె అభిమానులను శోకసముద్రంలో ముంచెత్తిందనే చెప్పాలి. తెలుగుతెరపై జమున లాగా వెలిగిన తార మరొకరు కానరారు. దాదాపు పాతికేళ్ళు నాయికగా రాణించారామె. అనితరసాధ్యంగా తనదైన అభినయంతో తెలుగువారినే కాకుండా, తమిళ, కన్నడ, హిందీ ప్రేక్షకులనూ అలరించారు. అంతటి జమునకు తగిన గౌరవం లభించలేదనే అభిమానులు విచారం వ్యక్తంచేసేవారు. కానీ, ఆమె మాత్రం ‘అవార్డులూ రివార్డులూ అడుక్కోవాలా? నేనేమిటో జనానికి తెలుసు’ అనే వారు.
Read Also: Heroine Jamuna: ఆ నాటి అందాల అభినేత్రి జమున!
జమున అనగానే ఆ తరం ప్రేక్షకులకు ఆమె నటించి, మెప్పించిన ‘సత్యభామ’ పాత్ర ముందుగా గుర్తుకు వస్తుంది. అంతకు ముందు సత్యభామ పాత్రను ఋష్కేంద్రమణి, సావిత్రి, యస్.వరలక్ష్మి వంటి మేటి నటీమణులు పోషించినప్పటికీ వారిని మరిపించేలా యన్టీఆర్ ‘శ్రీకృష్ణతులాభారం’లో సత్యభామపాత్రను అభినయించి అలరించారు జమున. యన్టీఆర్ అనగానే శ్రీకృష్ణునిగా ఆయన అభినయం గుర్తుకు వచ్చినట్టుగానే, తన పేరు తలచుకోగానే సత్యభామ గుర్తుకు వస్తారని అదే జనం తనకు అందించిన అపురూపమైన అవార్డు అంటూ ఎన్నోమార్లు జమున చెప్పుకున్నారు.
కళల కాణాచి అయిన తెనాలిలోనే జమున అభినయపర్వం మొదలయింది. అయితే జమున జన్మించింది మాత్రం కన్నడసీమలో. 1936 ఆగస్టు 20న జమున జన్మించారు. నిప్పాణీ శ్రీనివాసరావు, కౌసల్యాదేవి ఆమె కన్నవారు. జమున అసలు పేరు జానాబాయి. ఆమెకు ఏడేళ్ళ వయసున్నప్పుడు వారి కుటుంబం గుంటూరు జిల్లా దుగ్గిరాలకు మకాం మార్చారు. ఆ సమయంలోనే జమున నాట్యంలోనూ, సంగీతంలోనూ ప్రావీణ్యం సంపాదించారు. ఓ సారి సావిత్రి నాటకం వేయడానికి దుగ్గిరాల వచ్చినప్పుడు జమున వారి ఇంట్లోనే బస చేశారు. అప్పుడే ఆమెను అక్కా అంటూ పిలిచారు జమున. అప్పటి నుంచీ చిత్రసీమలో ప్రవేశించిన తరువాత కూడా ఈ అక్కాచెల్లెళ్ళ అనుబంధం కొనసాగింది. ఆ తరువాత వారిద్దరూ “మిస్సమ్మ, గుండమ్మ కథ” చిత్రాలలో అక్కాచెల్లెళ్ళుగానే నటించి అలరించారు.
Read Also: BIG Breaking: టాలీవుడ్‌లో మరో విషాదం.. వెండితెర సత్యభామ కన్నుమూత..
జమునకు చాలామంది ముక్కుమీద కోపం అంటారు. మరికొందరు ఆమెను గర్వి అనీ చెబుతారు. అయితే అది తన ఆత్మాభిమానం అనేవారు జమున. ఒకానొక సమయంలో అప్పటి అగ్రకథానాయకుడు ఏయన్నార్ తో ఆమెకు విభేదం వచ్చింది. దాంతో యన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరూ ఆమెను తమ చిత్రాలలో నాయికగా ఎంపిక చేసుకోలేదు. అయినప్పటికీ జంకకుండా తనదైన రీతిలో సాగారు. ఆ వివాదానికి విజయాధినేతలు చక్రపాణి- నాగిరెడ్డి ముగింపు పలికి, మళ్ళీ ఆ ఇద్దరు అగ్ర కథానాయకులతో జమున నటించేలా చేశారు. ఆ తరువాత కూడా మళ్ళీ వారిద్దరికీ విజయనాయికగానే జమున సాగారు.
జమునకు తొలి నుంచీ నాటి ప్రధాని ఇందిరాగాంధి అంటే ఎంతో గౌరవం, అభిమానం. దాంతోనే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. యన్టీఆర్ తెలుగుదేశం పార్టీ నెలకొల్పిన సమయంలో జమున మంగళగిరి నుండి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి చవిచూశారు. తరువాత 1989లో రాజమండ్రి నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ పై మరోమారు జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తనకు కాంగ్రెస్ పార్టీలో తగిన గౌరవం లభించలేదని, ఆమె బీజేపీ నీడలోనూ చేరారు. ఇలా రాజకీయాల్లోనూ జమున సాగారు.
జమున భర్త రమణరావు జువాలజీ ప్రొఫెసర్. వారికి ఇద్దరు పిల్లలు వంశీ, స్రవంతి. భర్త మరణం తరువాత అప్పటి దాకా నివాసమున్న పెద్దభవంతిని అమ్మేసి, తరువాత బంజారా హిల్స్ లోనే ఓ అపార్ట్ మెంట్ తీసుకొని, కూతురు స్రవంతి, ఆమె కొడుకుతో కలసి జీవిస్తున్నారు జమున. తన 85వ యేట కూడా ఎంతో హుషారుగా పలు యూ ట్యూబ్ ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇచ్చారామె. అలాంటి జమున హఠాన్మరణం అభిమానులకు తీరని ఆవేదన కలిగిస్తోంది. ఆమె అభినయ పర్వాన్ని తలచుకుంటూనే జమునకు తమ హృదయాల్లో ఘననివాళి అర్పిస్తున్నారు అభిమానులు.