Heroine Jamuna passed away: టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ఇవాల ఉదయం సీనియర్ సినీనటి జమున మృతిచెందారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. జమున మృతితో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆమె మృతి వార్త విన్నగానే టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగు చిత్ర పరిశ్రమలో కథానాయికలుగా కొనసాగిన కథానాయికలు ఎందరో ఉన్నారు. అయితే వారిలో కొందరు మాత్రమే తమ నటనా ప్రతిభతో పరిశ్రమలోనూ, ప్రేక్షకుల్లోనూ తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. అలాంటి వారిలో జమున ఒకరు. నిజానికి తన మాతృభాష తెలుగు కాకపోయినా తెలుగు నేలపైనే ఎదిగి సినీ పరిశ్రమలో అరుదైన కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్నారు ఆమె.
జమున 1937లో కర్ణాటక రాష్ట్రంలోని హంపిలో జన్మించింది. అయితే ఆమె కుటుంబ సభ్యులు ఆంధ్రాకు వెళ్లడంతో గుంటూరు జిల్లా దుగ్గిరాలో బాల్యం గడిచింది. జమున అసలు పేరు జానాబాయి. అయితే జన్మ నక్షత్రాన్ని బట్టి ఏదైనా నది పేరు ఉండాలని జ్యోతిష్యులు చెప్పడంతో.. ఆమె పేరు మధ్యలో ము అనే అక్షరాన్ని చేర్చారు. అలా ఆమె పేరు జమున అయింది. నటుడు జగ్గయ్యది అదే గ్రామం కావడంతో జమున కుటుంబానికి ఆయనతో కొంత పరిచయం ఉంది.
సినీ ప్రస్థానం :
జమున చదువుకునే రోజుల నుంచే నాటకాల వైపు ఆకర్షితురాలైంది. దాంతో ఆమెకు నాటకాల్లో పాల్గొనాలనే కోరిక కలిగింది. అప్పుడు తెనాలి సమీపంలోని మండూరు గ్రామంలో ఖిల్జీరాజ్యపట్టణం అనే నాటకానికి జగ్గయ్య ప్రత్యేకంగా జమునను ఎంపిక చేశారు. ఆ నాటకంలో మరో ప్రముఖ నటుడు గుమ్మడి కూడా నటించారు. ఆ నాటకమే కాకుండా అనేక ఇతర నాటకాలలో కూడా నటించింది. ఆ నాటకాలలో ఆమె ప్రతిభ నలుమూలలకు పాకడం వల్లే సినిమా ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి.
ఆమె మొదటి సినిమా ‘పుట్టినిల్లు’. తర్వాత అక్కినేని, ఎన్టీఆర్, జగ్గయ్య తదితర ప్రముఖ నటీనటులతో కథానాయికగా పలు చిత్రాల్లో నటించింది. కానీ ఆమె సత్యభామ పాత్ర పోషించడమే ఆమెను మరింత పాపులర్ చేసింది. ఇప్పటికీ చాలా మంది ఆ పాత్ర గురించే చర్చించుకుంటున్నారు. ఆ తర్వాత ‘శ్రీకృష్ణ తులాభారం’లోనూ అదే పాత్రను పోషించి మరిన్ని మంచి మార్కులు కొట్టేసింది. ఆ పాత్ర ఆమెను ఇండస్ట్రీలో నిలబెట్టింది. తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ సినిమాల్లో కూడా నటించింది. ఆ సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. ఆమె చాలా కాలం పాటు సినీ నటిగా ప్రస్థానం కొనసాగించారు. దివంగత ఇందిరాగాంధీ పట్ల అభిమానం, గౌరవంతో ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించారు.