NTV Telugu Site icon

Sandeep Kishan Birthday: పట్టు వదలని సందీప్ కిషన్!

Sandeep Kishan

Sandeep Kishan

Sandeep Kishan Birthday: చిత్రసీమను నమ్ముకుంటే, ఏదో ఒక రోజున కోరుకున్నది లభిస్తుందని కొందరి విశ్వాసం. అలా సినిమా రంగంలో కోరుకున్న తీరాలు చేరిన వారు ఎందరో ఉన్నారు. వారి స్ఫూర్తితోనే సాగుతున్నారు యంగ్ హీరో సందీప్ కిషన్. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తన దరికి చేరిన పాత్రలు పోషించి, ఇప్పటికి దాదాపు ఇరవైకి పైగా సినిమాల్లో నటించేశారు సందీప్ కిషన్. వాటిలో సందీప్ కు ఆనందం పంచిన చిత్రాలు కొన్నే అయినా, ఇంకా పట్టువదలని విక్రమార్కునిలా భారీ విజయం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు సందీప్ కిషన్.

సందీప్ కిషన్ 1987 మే 7వ తేదీన మద్రాసులో జన్మించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్లు ఛోటా కె.నాయుడు, శ్యామ్ కె.నాయుడు సోదరి కుమారుడే సందీప్ కిషన్. మేనమామలు ఇద్దరూ చిత్రసీమలో రాణిస్తూ ఉండడం వల్ల సందీప్ మనసు సైతం చిత్రసీమ వైపు పరుగు తీసింది. దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశారు సందీప్. ఆ తరువాత అతని మనసు నటనవైపు మళ్ళింది. లగడపాటి శ్రీధర్ నిర్మించిన ‘స్నేహగీతం’తో సందీప్ కిషన్ నటుడయ్యారు. ఆ పై దేవా కట్టా రూపొందించిన ‘ప్రస్థానం’లో సాయికుమార్ కొడుకుగా నటించి ఆకట్టుకున్నారు. ఆ తరువాత మరికొన్ని చిత్రాల్లో సందీప్ కిషన్ నటించినా, హీరోగా అతనికి ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ మంచి బ్రేక్ నిచ్చింది. ఈ సినిమాలో సందీప్ సరసన నాయికగా నటించిన రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరోయిన్ అయింది. “రా రా క్రిష్ణయ్య, బీరువా, జోరు, టైగర్…” ఇలా దాదాపు ఇరవై చిత్రాలలో హీరోగా నటించారు సందీప్. ఈ యేడాది ‘మైఖేల్’ చిత్రంతో జనం ముందుకు వచ్చారు. కానీ, సందీప్ కు ఆ సినిమా సైతం ఆశించిన సక్సెస్ ను అందించలేక పోయింది.

Read Also: Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న పీపుల్స్ స్టార్

ప్రస్తుతం సందీప్ కిషన్ మూడు చిత్రాలలో నటిస్తున్నారు. అందులో ‘ఊరు పేరు భైరవకోన’ తెలుగు చిత్రం. కాగా, ‘నరకాసురన్’, ‘కెప్టెన్ మిల్లర్’ అనే తమిళ చిత్రాల్లోనూ సందీప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాలతోనైనా సందీప్ కోరుకుంటున్న సక్సెస్ ఆయన దరి చేరుతుందేమో చూడాలి.