సార్వత్రిక ఎన్నికల వేళ డీప్‌ఫేక్ వీడియోలు బాలీవుడ్ నటులకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ఆయా పార్టీలకు మద్దతు తెల్పుతున్నట్లుగా నకిలీ వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో వదలుతున్నారు. అవి కాస్త వైరల్ కావడంతో నటులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవలే అమీర్‌ఖాన్ ఆ సమస్యను ఎదుర్కోగా.. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా రణవీర్ సింగ్ ఆ ఖాతాలో చేరారు. ఆయనకు సంబంధించిన డీప్‌ఫేక్ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఆయన ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబై పోలీసులు ఐపీసీ సెక్షన్, ఐటీ సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Mallikarjun Kharge: టైం ఇస్తే మా మేనిఫేస్టో వివరిస్తా.. ప్రధాని “ముస్లింలీగ్” విమర్శలపై ఖర్గే..
రణవీర్‌సింగ్ మాట్లాడిన మాటలను ఏఐ సాంకేతికతో మార్చివేసి ఆయన ఓ రాజకీయ పార్టీకి ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించినట్లుగా చూపించారు. ఈ వీడియో గంటల వ్యవధిలోనే సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై రణ్‌వీర్‌సింగ్ వెంటనే స్పందించారు. ఫేక్ వీడియోను నమ్మొద్దని అభిమానులను కోరారు. రణవీర్‌సింగ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. రణవీర్‌సింగ్ డీప్‌ఫేక్ వీడియో వ్యవహారం వివరాల్లోకి వెళితే.. ఇటీవల ఆయన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వారణాసిని సందర్శించారు. అక్కడ పలు దేవాలయాలను దర్శించుకున్న అనంతరం మీడియాతో ముచ్చటించారు. ఆ వీడియోలనే మార్పు చేశారు.
ఇది కూడా చదవండి: CSK vs LSG: చెన్నై భారీ స్కోరు.. సెంచరీతో చెలరేగిన గైక్వాడ్