NTV Telugu Site icon

IND vs PAK: మరోసారి తలపడనున్న భారత్, పాకిస్తాన్.. ఎప్పుడు, ఎక్కడంటే?

Asia Cup 2024 Ind Vs Pak

Asia Cup 2024 Ind Vs Pak

IND vs PAK Match on October 19 in Men’s T20 Emerging Asia Cup 2024: దాయాదులు భారత్, పాకిస్తాన్ జట్లు ఈ ఏడాదిలో మరోసారి తలపడనున్నాయి. జూన్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌ 2024లో పురుషుల జట్టు తలపడగా.. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో మహిళల టీమ్స్ తలపడ్డాయి. ఇక ఆసియా క్రికెట్ కౌన్సిల్ పురుషుల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024లో దాయాది జట్లు మరోసారి ఢీకొట్టనున్నాయి. అక్టోబర్ 19న ఇండియా ఎ, పాకిస్థాన్ ఎ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. మస్కట్‌లోని ఒమన్ క్రికెట్ అకాడమీ మైదానంలో ఈ హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది.

పురుషుల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024కు సంబంధించిన షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సోమవారం విడుదల చేసింది. అక్టోబర్ 18 నుంచి ఒమన్‌లో ఈ టోర్నీ జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 27న జరుగుతుంది. టోర్నీలో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఎలో శ్రీలంక ఎ, బంగ్లాదేశ్ ఎ, ఆఫ్ఘనిస్తాన్ ఎ, హాంకాంగ్ టీమ్స్ ఉన్నాయి. గ్రూప్‌-బిలో భారత్‌ ఎ, పాకిస్థాన్‌ ఎ, యుఎఇ, ఒమన్‌ జట్లు ఉన్నాయి. హాంకాంగ్, యూఏఈ, ఒమన్ ప్రధాన జట్లే టోర్నీలో ఆడనున్నాయి.

Also Read: T20 World Cup 2024: ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌కు రెండో విజయం.. మరొక్క గెలుపే!

ఆసియా కప్ 2024 టోర్నీలో మొదటి మ్యాచ్ మధ్యాహ్నం 1 గంటకు.. రెండో మ్యాచ్ సాయంత్రం 5:30 గంటలకు ఆరంభం అవుతాయి. ఈ టోర్నీ కోసం పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ టీమ్స్ తమ జట్లను ప్రకటించాయి. 2013లో ఆరంభమైన ఈ టోర్నీ ఇప్పటి వరకు ఐదుసార్లు జరిగింది. పాకిస్థాన్, శ్రీలంకలు రెండుసార్లు గెలుపొందగా.. భారత్ ఒకసారి విజేతగా నిలిచింది. గత రెండుసార్లు పాక్ విజేతగా నిలిచింది. గతంలో అండర్-23 ఆటగాళ్లు ఈ టోర్నీలో ఆడేవారు. గత ఎడిషన్ నుంచి ఎ జట్ల టోర్నీగా మార్చారు.