గొర్రెల పంపిణీ అవకతవకల్లో ఏసీబీ అధికారులు నలుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో నలుగురు పశుసంవర్ధక శాఖ అధికారులు ఉన్నారు. వారిలో కామారెడ్డి పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రవి, మేడ్చల్ పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆదిత్య, అడల్ట్ ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ గణేష్, రంగారెడ్డి గ్రౌండ్ వాటర్ మేనేజర్ రఘుపతి రెడ్డి ఉన్నారు. గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన కుంభకోణానికి సంబంధించిన కేసును ఏసీబీ విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. గొర్రెల పంపిణీలో అవకతవకలు పాల్పడి రూ.2.10 కోట్లు కొట్టేశారు అధికారులు. గొర్రెలను కొనుగోలు దారులకు డబ్బులు చెల్లించకుండా బ్రోకర్ల అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేశారు. కాగా.. గుంటూరు జిల్లా చెందిన గొర్రెల పెంపకందారులు ఇచ్చిన ఫిర్యాదు పై ఏసీబీ కేసు నమోదు చేసింది.
Read Also: Damodara Rajanarsimha: ఆసుపత్రుల నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేసి అందుబాటులో తీసుకురావాలి..
2017 ఏప్రిల్లో గత ప్రభుత్వం గొర్రెల పెంపకం అభివృద్ధి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారునికి 20 గొర్రెలను, ఒక పొట్టేలను కలిపి ఒక యూనిట్‌గా అందజేశారు. ఒక యూనిట్ విలువ రూ.1.25 లక్షలు కాగా అందులో 75 శాతం రాయితీ ఇచ్చారు. మిగిలిన 25 శాతం నగదును లబ్ధిదారుడే చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రెండో విడత భాగంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన రైతుల నుంచి గొర్రెలను కొనుగోలు చేసి కొంతవరకు నగదు ఇచ్చారు. మిగిలిన రైతులకు రూ.2కోట్లకు పైగా నగదు చెల్లించాల్సి ఉండగా డబ్బులు చెల్లించకుండా మోసం చేశారని బాధితులు వాపోయారు. ఈ గొర్రెల పంపిణీ పథకంలో పశుసంవర్ధక శాఖ అధికారులు కుమ్మక్కై, కాంట్రాక్టర్లు బినామీ పేర్ల మీద డబ్బులు కాజేశారని ఏసీబీ అధికారుల దృష్టికి బాధితులు తీసుకువచ్చారు. ఈ క్రమంలో స్కామ్ పై విచారణ చేపట్టి నలుగురిని అరెస్ట్ చేశారు.