Abrar Ahmed: పాకిస్థాన్‌కు చెందిన మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. వెస్టిండీస్‌తో జరగబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు అతను ఎంపికైతే.. యూకే (UK)లో జరిగే ది హండ్రెడ్ (The Hundred) టోర్నమెంట్‌లో ఆడే అవకాశం కోల్పోవాల్సి వస్తుంది. ఈ లీగ్‌లో అతడిని సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమానికి చెందిన ‘సన్‌రైజర్స్ లీడ్స్’ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అబ్రార్ ముందు ‘దేశమా? లేక క్లబ్ క్రికెటా?’ అనే చర్చ నడుస్తోందని, అతను రెడ్-బాల్ క్రికెట్ కోసం జాతీయ జట్టుతో చేరాలా లేక వైట్-బాల్ క్రికెట్ కోసం ఫ్రాంచైజీ వైపు వెళ్లాలా అనే సందిగ్ధంలో పడ్డాడని అంతర్జాతీయ మీడియా నివేదించింది. ‘ది హండ్రెడ్’ టోర్నీ జూలై 21న ప్రారంభం కానుండగా, వెస్టిండీస్‌తో మొదటి టెస్ట్ మ్యాచ్ జూలై 25న ప్రారంభం కానుంది. అంటే లీగ్ మొదలైన నాలుగు రోజులకే టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుండటంతో అబ్రార్ అహ్మద్, అతని ఏజెంట్ తీవ్ర గందరగోళంలో ఉన్నారు.
ది హండ్రెడ్ వేలంలో అబ్రార్ అహ్మద్‌ను కావ్య మారన్‌కు చెందిన సన్‌రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ ఏకంగా 1,90,000 పౌండ్ల (సుమారు రూ. 2.3 కోట్లు) భారీ ధరకు కొనుగోలు చేయడం భారత క్రికెట్ వర్గాల్లో పెద్ద వివాదానికి దారితీసింది. ఒక పాకిస్థానీ ఆటగాడిని భారీ ధర పెట్టి కొనుగోలు చేయడంపై సోషల్ మీడియాలో కావ్య మారన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. జాతీయ సెంటిమెంట్‌ను పక్కనబెట్టి ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకుందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా కావ్య మారనే వేలంలో ప్యాడిల్ పైకెత్తి ఈ పాక్ స్పిన్నర్‌ను దక్కించుకున్నారనే వార్తలతో ఈ వివాదం మరింత ముదిరింది. ఒకవేళ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) అబ్రార్‌ను ‘ది హండ్రెడ్’ టోర్నీ కోసం విడుదల చేయకపోతే అది ఫ్రాంచైజీకి పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని ఏజెంట్ వర్గాలు భావిస్తున్నాయి. కోట్ల మంది భారతీయుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చినప్పటికీ సన్‌రైజర్స్ లీడ్స్ యాజమాన్యం వెనక్కి తగ్గకుండా అబ్రార్‌ను కొనుగోలు చేసిందని, కాబట్టి అతను ఈ లీగ్‌లో ఆడటం చాలా కీలకమని వారు పేర్కొంటున్నారు. అయితే, వెస్టిండీస్ బ్యాటర్లను ఎదుర్కోవడానికి ఒక క్వాలిటీ లెగ్ స్పిన్నర్ అవసరమని భావిస్తున్న పాకిస్థాన్ జాతీయ సెలెక్షన్ కమిటీ, రాబోయే టెస్ట్ సిరీస్ కోసం అబ్రార్ పేరును పరిశీలిస్తోంది. దీనిపై సోమవారం అధికారికంగా జట్టును ప్రకటించనున్నారు.

