NTV Telugu Site icon

Asia Cup 2024: వరుసగా రెండో విజయం.. సెమీఫైనల్లో భారత్‌!

India A Semi Final

India A Semi Final

ఏసీసీ పురుషుల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024లో భారత్‌-ఏ జట్టు సెమీఫైనల్లో అడుగుపెట్టింది. గ్రూప్‌-బిలో భాగంగా సోమవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లీగ్ దశలో వరుసగా రెండు విజయాలతో భారత్‌ (4 పాయింట్లు) గ్రూప్‌-బిలో అగ్రస్థానంలో ఉంది. ఒక్కో మ్యాచ్‌లో గెలిచిన పాకిస్థాన్, యూఏఈ టీమ్స్ బుధవారం తలపడనున్నాయి. ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్‌కు చేరుతుంది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న యూఏఈ 16.5 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌట్ అయింది. రాహుల్‌ చోప్రా (50; 50 బంతుల్లో 2×4, 3×6) ఒంటరి పోరాటం చేశాడు. సిల్‌ హమీద్‌ (22), మయాంక్‌ కుమార్‌ (10) మాత్రమే రెండంకెల స్కోరు అందుకున్నారు. భారత బౌలర్లలో రసిఖ్‌ సలామ్‌ (3/15), రమణ్‌దీప్‌ సింగ్‌ (2/7) సత్తాచాటారు. అన్షుల్‌ కాంబోజ్, వైభవ్‌ అరోరా, అభిషేక్, నేహాల్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

స్వల్ప లక్ష్యాన్ని భారత్‌ 10.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అభిషేక్‌ శర్మ (58; 24 బంతుల్లో 6×4, 4×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ తిలక్‌ వర్మ (21), ఆయుష్ బదోని (12) కీలక పరుగులు చేశారు. ప్రభసిమ్రాన్ సింగ్ (8), నేహాల్ వధేరా (6) తేలిపోయారు. భారత్‌ తన తొలి మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. భారత్‌ తన ఆఖరి గ్రూప్‌ మ్యాచ్‌లో బుధవారం ఒమన్‌తో తలపడనుంది. ఒమన్‌ ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రయించింది. ఇక గ్రూప్‌-ఎలో శ్రీలంక నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఒక్కో గ్రూపులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌ చేరతాయన్న విషయం తెలిసిందే.

Show comments