Abhijeet Deepke: ఎవరీ అభిజీత్ దీప్కే? ఆందోళనలకు నిధులు ఎక్కడివి?.. ‘సీజేపీ’ నిరసనల వెనుక దాగి ఉన్న ప్రశ్నలు, అనుమానాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhijeet Deepke: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సీజేపీ, అభిజీత్ దీప్కే పేర్లు మారుమోగుతున్నాయి. దీప్కే ఇండియాలో అడుగుపెట్టడమే ఆలస్యం.. అతడి కోసం విమానాశ్రయం బయట వేలమంది అభిమానులు సిద్ధంగా ఉన్నారు. ఇక దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) పేరిట నెల రోజులుగా వీధుల్లో హోరెత్తిన నిరసనలు చివరికి చర్చల దిశగా మళ్లాయి. కానీ అసలు ప్రశ్న ఏంటంటే.. అసలు అభిజీత్ దీప్కే ఎవరు? మహారాష్ట్రలో పెరిగాడు, కొంత కాలం ఆమ్ ఆద్మీ పార్టీలో పని చేశాడు. బోస్టన్‌లో పబ్లిక్ రిలేషన్స్ (PR) చదివాడనే కొన్ని అరకొర సమాచారాలు తప్ప అతడి వెనుక ఉన్న అసలు రాజకీయ అనుభవం ఏంటో ఎవరికీ తెలియదు. ఇంత పెద్ద మూమెంట్‌ను నడిపిస్తున్న అభిజీత్ నేపథ్యం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది! ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. అభిజీత్ ఆశయాల గురించి కనీస అవగాహన లేకుండా యువత అతడి వెనక గుడ్డిగా నడవడం! అసలు ఈ మూవ్‌మెంట్‌కు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. రాబోయే రోజుల్లో ఏమవుతుందో తెలియదు. అయినా సరే వేలాది మంది జంతర్ మంతర్ వద్దకు చేరిపోయారు. చివరికి అతడి కోసం జంతర్ మంతర్ వద్ద ప్రాణాలు ఇచ్చేలా ఎగబడిన యువతకు సైతం అభిజీత్ గురించి పెద్దగా తెలియదు. అసలు తెలుసుకోవాలనే ఆసక్తి కూడా లేదు!
ఒక్కసారి మన దేశ రాజకీయాల్ని గమనిస్తే.. రాహుల్ గాంధీ, ఒమర్ అబ్దుల్లా, ఉదయనిధి స్టాలిన్, సచిన్ పైలట్ వరకు ఇక్కడ ప్రతి వయస్సులోనూ, ప్రతి సిద్ధాంతంతోనూ ప్రతిపక్ష నాయకులున్నారు. వారి రాజకీయాలపై మనకు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ వారి నేపథ్యం ఏంటో, వారు దేనికోసం నిలబడతారో, అధికారంలోకి వస్తే ఏం చేస్తారో స్పష్టంగా తెలుసు. మరి అలాంటిది, అసలు సదరు వ్యక్తి యోగ్యుడా లేక మోసగాడా అని కూడా తెలియకుండా మన యువత అతడి వెనుక ఎందుకు పరిగెత్తింది? ఆ నిరసనకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరూ ఎందుకు అడగడం లేదు? జునైద్ అనే వ్యక్తి ఉచితంగా ఆహారం తెచ్చి ఇస్తుంటే.. స్వీకరించారే తప్ప, ఆ ఖర్చుల వెనుక ఉన్న హస్తం ఎవరిదో ప్రశ్నించడం లేదు.
Also Read
- 2027 వరల్డ్‌కప్‌కు Ravi Shastri డ్రీమ్ టీమిండియా ఇదే.. రో-కోకు చోటు.. నలుగురు పేసర్లతో జట్టు మాములుగా లేదుగా.!
- Traffic Police New Rules: ట్రాఫిక్ పోలీసులకు కొత్త రూల్స్.. డ్యూటీలో మొబైల్ వాడకం కుదరదు..!
- Suri Murd*er: హైదరాబాద్ మీర్ పేట్ లో రౌడీషీటర్ సూరి దారుణహత్య.!
- AP COVID-19 Update: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పెరుగుతోన్న ఒమిక్రాన్ RF.5 వేరియంట్ కేసులు
మన దేశంలో ఏదైనా కొత్తగా జరుగుతుందంటే అది పాత కథలను నెమరేసుకుంటాం.. గతంలో జరిగిన ప్రొటెస్ట్లతో పోల్చుకుంటాం. కానీ ఈ మూమెంట్లో కథానాయకుడు చాలా విచిత్రంగా కనిపిస్తున్నాడు. ఇక, 2011 నాటి లోక్‌పాల్ ఉద్యమాన్ని చూస్తే.. అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ బేడీ, ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ వంటి వారంతా ప్రజలకు ముందే తెలిసిన అనుభవజ్ఞులు. వారికి ఒక గుర్తింపు ఉంది. కానీ 2026 నాటి ఈ ఉద్యమానికి నాయకుడు ఓ అపరిచితుడు. అందుకే అతడికి ఓ నమ్మకమైన తొడు అవసరమైంది. ఇందుకు గానూ సోనమ్ వాంగ్‌చుక్ వంటి నాయకులు తెరమీదకు తెచ్చాడు. ఆమరణ నిరాహార దీక్ష చేసేలా ఉసిగొలిపాడు. దీంతో ఈ గందరగోళం మధ్య అభిజీత్ వెంట నడిచే యువతకు కొంత నమ్మకం, కాస్త స్థిరత్వం ఏర్పాడ్డాయి. అక్కడ కనిపించింది ఒక ఉద్యమానికి వచ్చిన ప్రజాదరణ కాదు.. ఒక నాయకుడి కోసం మన యువత పడుతున్న తపన!
మరోవైపు, 2024 ఎన్నికల్లో 43 శాతం ఓటర్లు మాత్రమే NDAకి ఓటేశారు. నియమాల ప్రకారం లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ మిగిలిన 57 శాతం మందికి గొంతుకగా మారాలి. ప్రధానమంత్రి దేశం మొత్తానికి ప్రధాని అయినట్లే, ప్రతిపక్ష నాయకుడు కూడా ఓటేయని ప్రజలందరి ప్రతినిధిగా ఉండాలి. ప్రభుత్వ వైఫల్యం వల్ల ఈ ఉద్యమం మొదలై ఉండొచ్చు, కానీ యువతకు సరైన గొంతుకగా మారడంలో ప్రతిపక్షం ఘోరంగా విఫలమవ్వడం వల్లే ఇది ఇంత పెద్దగా మారింది. రాహుల్ గాంధీ విశ్వవిద్యాలయాలు తిరుగుతూ విద్యార్థులతో మాట్లాడుతున్నప్పటికీ, యువత ఎందుకు ఒక అపరిచితుడి వెనుక నడిచింది? ఈ ప్రశ్నే ప్రతిపక్షాన్ని ఎక్కువగా వేధించాలి.
ఈ ఘటన వెనుక ఉన్న సూత్రాన్ని గమనిస్తే.. ప్రజల్లో ఉన్న అసంతృప్తికి, ఒక సిద్ధాంతం తోడైనప్పుడు ఉద్యమం పుడుతుంది. కానీ ఇక్కడ అసంతృప్తి కొండంత ఉంటే, సిద్ధాంతం మాత్రం శూన్యం! NEET పరీక్షల విఫలమైన దుస్థితిలో చనిపోయిన పిల్లల దృశ్యాలను ఉపయోగించి దిప్కే సానుభూతిని సమకూర్చుకున్నాడు. బాధితులైన సజీవ విద్యార్థులు ఇంట్లో రీ-ఎగ్జామ్‌కు సిద్ధమవుతుంటే, ఈయన ఆ విషాదాన్ని రాజకీయ పంటగా మార్చుకున్నాడు. ప్రభుత్వమేమో ఈ ఒత్తిడిని తేలికగా వదిలేసింది. ఫలితంగా రకరకాల అజెండాలు ఉన్న వర్గాలు వచ్చి చేరి, ఒకరి సిద్ధాంతాన్ని మరొకరు రద్దు చేసుకుంటూ, దారితెన్ను లేని గుంపుగా మిగిలిపోయారు.
అయితే, నాయకుడు లేని ఈ అసంతృప్తికి ఒక ప్రమాదకర సిద్ధాంతం తోడైతే ఏమవుతుంది? అది దేశ శ్రేయస్సు కోరే సిద్ధాంతమైతే వ్యవస్థ సంస్కరణల వైపు వెళ్తుంది. అలా కాకపోతే ఏమవుతుందో మన పొరుగు దేశాలను చూస్తే అర్థమవుతుంది. 2022లో శ్రీలంక, 2024లో బంగ్లాదేశ్, 2025లో నేపాల్. నేపాల్‌లో 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై నిషేధం విధిస్తే.. ఏళ్ల తరబడి ఉన్న నిరుద్యోగం, అవినీతి ఆగ్రహంగా మారి ఐదు రోజుల్లో పార్లమెంటు తగలబడింది. ప్రధాని రాజీనామా చేశారు. 74 మంది ప్రాణాలు కోల్పోయారు. నూతన ప్రభుత్వం ఏర్పాడింది. ఈ రోజు నేపాల్ యువత తమ కొత్త ప్రభుత్వంపై మళ్లీ పోరాడుతోంది. 74 మంది ప్రాణాలకు అర్థమేముంది?
ఇక్కడ మరికొన్ని విషయాలను దేశ యువత తప్పక తెలుసుకోవాలి. మన దేశంలో వర్గ పోరును రెచ్చగొట్టడానికి పాకిస్తాన్ ఐఎస్ఐ (ISI) నిరంతరం ప్రయత్నిస్తోంది. ప్రాంతీయ విభేదాలను పెంచడానికి బంగ్లాదేశ్ శక్తులు పనిచేస్తున్నాయి. భారత ప్రభుత్వాన్ని అవినీతిమయంగా చిత్రీకరించడానికి చైనా ఆధారిత నకిలీ సోషల్ మీడియా నెట్‌వర్క్‌లు పనిచేస్తున్నాయని మెటా సంస్థ ఇదివరకే గుర్తించింది. మన యువత నిరంతరం సోషల్ మీడియాలోనే గడుపుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నట్లు యువతే మన దేశానికి అతిపెద్ద ఆస్తి.. కానీ ఆ ఆస్తిని మనం పట్టించుకోకుండా వదిలేస్తే, శత్రువులకు అది సులభమైన లక్ష్యంగా మారుతుంది.
ఇక ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ప్రజాస్వామ్యంలో నిరసన అనేది ఒక సేఫ్టీ వాల్వ్, దాన్ని తొక్కేయకూడదు. రాజకీయనాయకులు సిమ్ కార్డులు మార్చినంత సులభంగా పార్టీలు మారుతుంటే.. వ్యవస్థపై యువతకు నమ్మకం పోతుంది. ప్రభుత్వ దర్యాప్తు సంస్థలైన ED, CBI, ఎలక్షన్ కమిషన్లను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు కేవలం ప్రచారం కావొచ్చు. కానీ ఆ ప్రచారాన్ని ప్రభుత్వం సరైన సమయంలో తిప్పికొట్టకపోతే, యువత దాన్ని నిజమేనని నమ్ముతుంది. మనకు కేవలం స్వచ్ఛమైన వ్యవస్థ మాత్రమే కాదు.. స్వచ్ఛంగా కనిపిస్తూ, నమ్మకం కలిగించే వ్యవస్థ కూడా కావాలి.
ఇక, అభిజీత్ దిప్కే రేపు ఒక గొప్ప దేశభక్తుడు కావొచ్చు, రాజకీయ నాయకుడు కావొచ్చు లేదా ఒక సాధారణ వార్తగా మిగిలిపోవచ్చు. ఈ ఉద్యమం కూడా కొద్ది రోజుల్లో సర్దుమణుగుతుంది. కానీ ఆ ఉద్యమం చూపించిన ఖాళీ మాత్రం అలాగే ఉంటుంది. సమస్యలతో బాధపడుతూ, సరైన రాజకీయ వేదిక లేక, చేతిలో మైక్ పట్టుకుని వచ్చిన ఏ అపరిచితుడి వెనుకైనా నడవడానికి కోట్లాది మంది భారతీయ యువకులు సిద్ధంగా ఉన్నారు. ఒకవైపు మన ప్రైవేట్ సంస్థలు అంతరిక్షంలోకి రాకెట్లను పంపుతున్నాయి, దేశంలో హైడ్రోజన్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. పివి సింధు వంటి క్రీడాకారులు రికార్డులతో తిరిగి వస్తున్నారు. దశాబ్దాలుగా వేచి చూస్తున్న అభివృద్ధి అంచున ఇండియా నిలబడి ఉంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే మన దేశాన్ని నాశనం చేయడానికి లోపల, వెలుపల అనేక శక్తులు ఎదురుచూస్తున్నాయి. నేపాల్ విధ్వంసం మనకు నేర్పిన పాఠం ఏంటంటే.. యువత ప్రమాదకరమైన వారని కాదు. కానీ శత్రువులు మన ఇంట్లో నిప్పు పెట్టకుండా ఉండాలంటే.. ముందుగా మనం మన ఇంటిని చక్కదిద్దుకోవాలి.
తాజావార్తలు
-
Abhijeet Deepke: ఎవరీ అభిజీత్ దీప్కే? ఆందోళనలకు నిధులు ఎక్కడివి?.. ‘సీజేపీ’ నిరసనల వెనుక దాగి ఉన్న ప్రశ్నలు, అనుమానాలు!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
2027 వరల్డ్‌కప్‌కు Ravi Shastri డ్రీమ్ టీమిండియా ఇదే.. రో-కోకు చోటు.. నలుగురు పేసర్లతో జట్టు మాములుగా లేదుగా.!
-
Avengers Doomsday : అవెంజర్స్ డూమ్స్ డే తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. థోర్ మాస్ విధ్వంసం
-
Traffic Police New Rules: ట్రాఫిక్ పోలీసులకు కొత్త రూల్స్.. డ్యూటీలో మొబైల్ వాడకం కుదరదు..!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!