AB De Villiers: టీమిండియా క్రికెట్ దిగ్గజ ద్వయం రోహిత్ శర్మ – విరాట్ కోహ్లీలపై ఇటీవల కాలంలో వస్తున్న విమర్శలపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రోహిత్ శర్మ – విరాట్ కోహ్లీ కెరీర్ ముగింపు దశకు చేరుకోవడం వల్లే కొందరు కావాలని వారిని తక్కువ చేసి మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ – కోహ్లీ ఆరంభం చాలా పేలవంగా ప్రారంభమైంది. మొదటి మ్యాచ్‌లో ఈ ఇద్దరూ స్టార్ ప్లేయర్స్ ఫ్యాన్స్‌ను నిరాశపరిచే ప్రదర్శనలు ఇచ్చారు. రోహిత్ కేవలం 8 పరుగులు మాత్రమే చేయగా, కోహ్లీ ఖాతా తెరవలేకపోయాడు. రెండవ వన్డేలో రోహిత్ 73 పరుగులు చేశాడు, కానీ కోహ్లీ మరోసారి స్కోరు చేయకుండానే మైదానాన్ని వీడాడు. ఇది టీమిండియా సిరీస్ ఓటమికి దారితీసింది.
READ ALSO: Cyclone Montha: విరుచుకుపడుతున్న మొంథా తుఫాన్.. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దు..!
డివిలియర్స్ ఏం చెప్పాడంటే..
అయితే ఈ ఇద్దరూ ప్లేయర్స్ సిరీస్ చివరి మ్యాచ్‌లో అసలు సిసలైన వారి ఆటను ప్రదర్శించి, రెండవ వికెట్‌కు 168 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి భారత్‌కు తొమ్మిది వికెట్ల విజయాన్ని అందించారు. రోహిత్ అజేయంగా 121 పరుగులు చేయగా, కోహ్లీ 74 పరుగులు చేసి ఆస్ట్రేలియాపై విజయాన్ని నమోదు చేశారు. అయితే తాజాగా డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. దేశానికి, క్రికెట్‌కు జీవితాలను అంకితం చేసిన ఆటగాళ్లపై కొందరు ప్రజలు ఎందుకు విమర్శలు గుప్పించాలని అనుకుంటున్నారో అర్థం కావడం లేదని అన్నారు. “ప్రజలకు ఏమి జరుగుతుందో నాకు తెలియదు. నేను వారిని మనుషులు అని పిలవాలో లేదో కూడా అర్థం కావడం లేదు. ఆటగాళ్లు తమ కెరీర్ ముగింపుకు చేరుకున్న వెంటనే, కొన్ని బొద్దింకలు వాటి రంధ్రాల నుంచి బయటకు వస్తాయి. ఎందుకు? తమ దేశానికి, ఈ అందమైన ఆటకు ప్రాణాలను అర్పించిన ఆటగాళ్ల పట్ల కొందరు పనికట్టుకొని విమర్శలు చేయాలని చూస్తున్నారు” అని ఆయన అన్నారు.
“గత కొన్ని నెలలుగా వారిద్దరూ చాలా విమర్శలను ఎదుర్కొన్నారు. అందరూ వారి క్రికెట్ జీవితాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నా అభిప్రాయంలో కొందరు మాత్రమే ఇలా మాట్లాడుతున్నారు. చాలా మంది రోహిత్ – విరాట్ అద్భుతమైన కెరీర్‌లను గౌరవిస్తారు, వారి ఆటను ఎంజాయ్ చేస్తారు” అని ఆయన అన్నారు. ఏది ఏమైనా దిగ్గజ క్రీడాకారులపై ఇలాంటి విమర్శలు చేయడం సరికాదని డివిలియర్స్ అభిప్రాయపడ్డారు.
READ ALSO: US Navy Plane Crash: చైనా సముద్రంలో కూలిన అమెరికా విమానాలు..
