NTV Telugu Site icon

Arogya Sri: ఏపీలో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్!

Arogyasri

Arogyasri

Arogya Sri: ఏపీలో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. పెండింగ్‌ బిల్లుల చెల్లింపులపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ అధికారులు, ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ అసోసియేషన్‌ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఇప్పటికే ప్రకటించినట్లుగా బుధవారం నుంచి అసోసియేషన్‌లో సభ్యత్వం కలిగిన ఆసుపత్రుల్లో రోగులకు చికిత్స అందించడాన్ని నిలిపివేయనున్నట్లు ఆశా యాక్టింగ్‌ ప్రెసిడెంట్‌ వై రమేష్, ప్రధాన కార్యదర్శి సి.అవినాష్‌ ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే ఉద్యోగుల ఆరోగ్య బీమా కింద కొత్త కేసులను తీసుకునేది లేదని స్పష్టం చేశారు. గతేడాది ఆగస్టు నుంచి బకాయిపడిన రూ.1,500 కోట్ల బిల్లులను వెంటనే చెల్లించాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఆ పెండింగ్ బిల్లుల్ని చెల్లించకపోతే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని అసోసియేషన్ తెలిపింది. మంగళవారం చర్చలు విఫలం కావడంతో సేవల్ని నిలిపివేస్తున్నట్లు తెలిపారు. నిన్న జరిగిన జూమ్ మీటింగ్‌లో ప్రభుత్వం బిల్లులు క్లియర్ చేస్తుందని సీఈవో లక్ష్మీశా చెప్పినప్పటికీ గతంలో కూడా ఇదే చెప్పారని, వెంటనే బకాయిలు చెల్లించకుంటే రోగులకు చికిత్స అందించడాన్ని నిలిపివేస్తామని ఆశా స్పష్టం చేసింది.

Read Also: Iran: రైసీ హెలికాప్టర్ ప్రమాదం.. దర్యాప్తునకు సాయం చేయమన్న అమెరికా

ఏపీ ప్రభుత్వం పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం చర్యలు తీసుకుంటుందని సీఈవో అసోసియేషన్‌కు చెప్పారు. గతంలోనూ ఇలాగే పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని చెప్పారని.. కానీ చెల్లింపులు జరగలేదని అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. పెండింగ్ బిల్లుల చెల్లింపుపై ప్రభుత్వం నుంచి చర్యలు కనిపించకపోవడంతో నేటి నుంచి ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల ఆరోగ్య బీమా కింద కొత్త కేసులను తీసుకునేది లేదని తేల్చి చెప్పారు. ఏపీలో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల అసోసియేషన్‌ సేవలు నిలిపివేయడంపై ట్రస్ట్‌ సీఈవోకి, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖను పంపారు. నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు లేఖలో తెలిపారు. ఇప్పటికే ఆస్పత్రుల్లో ఉన్న వారికి మాత్రం వైద్య సేవలు కొనసాగిస్తామన్నారు. ప్రైవేట్‌ మెడికల్‌ కళాశాలల్లో కూడా ఆరోగ్య సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్ మెడికల్ కాలేజీస్ అసోసియేషన్‌ ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది.

కొవిడ్ మహమ్మారి సమయంలో అందించిన చికిత్స బిల్లులు, ఆరోగ్యశ్రీ బిల్లులు మూడేళ్ల నుంచి ప్రభుత్వం చెల్లించడం లేదని పేర్కొంది. ఈ బకాయిలు చెల్లించే వరకు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. మందుల ఖర్చుకు పూర్తిగా భరించేందుకు ముందుకు వచ్చేవారికి వైద్యాన్ని అందిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్ మెడికల్ కాలేజీస్ అసోసియేషన్‌ పేర్కొంది. మెడికల్ కాలేజీల్లో ఇప్పటికే ఇన్‌పేషెంట్లుగా ఉన్న వారికి ఆరోగ్యశ్రీ కింద సేవలు కొనసాగిస్తామని క్లారిటీ ఇచ్చారు.