రాయలసీమలోనే అత్యంత ప్రసిద్ధి గాంచిన లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం గ్రామంలో గంగమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా ముగిసింది. రెండు రోజులపాటు (మార్చి 1, 2) జరిగిన జాతర ఉత్సవాలు నేడు ముగిశాయి. ఆర్తుల అభయప్రదాతగా విరాజిల్లుతున్న గంగమ్మ దేవత అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉత్సవాలలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
గంగమ్మ అమ్మవారికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, హరిత దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు చేశారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఆలయ పూజారులు, జాతర నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు అమ్మవారికి బోనాలు పట్టి సమర్పించారు. చాందినీ బండ్లు, కుంకుమ బండ్లు కట్టి.. ఆలయం చుట్టూ ప్రదర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. కోర్కెలు తీర్చే కొంగు బంగారమైన గంగమ్మ జాతరను నిర్వాహకులు ఘనంగా ముగించారు.
ప్రతి ఎద్దడి మహాశివరాత్రి ముగిసిన రెండవ రోజు నుంచి గంగమ్మ జాతర ప్రారంభమవుతుంది. అమ్మవారికి పుట్టినిల్లుగా భావించే కస్తూర్రాజుగారిపల్లె పంచాయతీలోని చాగలగుట్టపల్లె నుంచి.. గంగమ్మ తల్లి ఉత్సవ విగ్రహాన్ని అప్పలరాజుగారిల్లె, మార్లవాండ్లపల్లె, మర్రిచెట్టు, చౌటపల్లెల మీదుగా ఊరేగింపుగా తీసుకొస్తారు. అనంతపురం గ్రామంలోని గంగమ్మ దేవాలయానికి ఉత్సవ విగ్రహం రాగానే.. ఆలయం ముంగిట అమ్మవారికి బోనాలు సమర్పించి జంతువులను బలి ఇస్తారు. ఇదే రోజు భక్తులు శిద్దల పూజ, సిడిమాను పూజ.. రాత్రికి చాందిని, కుంకుమ బండ్లు తిప్పి మొక్కులు చెల్లించుకుంటారు. మొదటి రోజును నిండు తిరునాలు అని, రెండవ రోజును మైల తిరునాలు అని పిలుస్తారు. మైల తిరునాల రోజు సాయంత్రం గంగమ్మకు ఉత్సవ విగ్రహాన్ని చాగలగుట్టపల్లెకు చేర్చడంతో తిరునాలు పూర్తవుతాయి.