ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేడు సామూహిక నిరాహార దీక్షకు పిలుపునిచ్చింది. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఈ ఉపవాస దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆప్ ప్రకటించింది. సామూహిక నిరాహార దీక్షల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయాలని ప్రజలను కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ వాట్సాప్ నంబర్‌ను రిలీజ్ చేసింది. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సామూహిక నిరాహారదీక్ష కార్యక్రమం ప్రారంభం అయింది. ఇక, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆప్ కి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కౌన్సిలర్లు అందరూ ఇందులో నిరసన చేస్తున్నారు. దీంతో పాటు వివిధ రంగాల్లో పని చేస్తున్న పౌర సమాజానికి చెందిన వారు కూడా సామూహిక నిరాహార దీక్షలో పాల్గొనేందుకు జంతర్ మంతర్‌కు చేరుకుంటున్నారు.
Read Also: Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు షాక్.. రాయితీ, హాలిడే కార్డులు రద్దు..
కాగా, ఉత్తరప్రదేశ్, హర్యానా, పశ్చిమ బెంగాల్ సహా దేశంలోని 25 రాష్ట్రాల రాజధాని, జిల్లా, బ్లాక్ హెడ్‌క్వార్టర్స్‌తో సహా గ్రామాలు, పట్టణాలలో ప్రజలు సామూహిక ఉపవాస దీక్షలు చేస్తున్నట్లు ఆప్ నేత గోపాల్ రాయ్ చెప్పారు. భారత్‌తో పాటు అమెరికాలోని న్యూయార్క్, బోస్టన్, లాస్ ఏంజిల్స్, వాషింగ్టన్ డీసీ, కెనడాలోని టొరంటో, ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్, లండన్‌తో సహా పలు చోట్ల ప్రజలు ఈ ఉపవాస దీక్షలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Read Also: Kakarla Suresh: తెలుగుదేశం విజయానికి బీసీలు ఐక్యంగా కృషి చేయాలి..
అలాగే, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తో పాటు ఆ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా అందరు షహీద్ భగత్ సింగ్ నగర్ జిల్లాలోని ఖట్కర్ కలాన్ దగ్గర నిరాహార దీక్ష చేపట్టారు. నిరాహార దీక్షలో పాల్గొనాలని పంజాబ్ ప్రజలకు కూడా సీఎం విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గత నెలలో అరెస్టు చేసింది. ఏప్రిల్ 15వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు విధించింది.