Site icon NTV Telugu

Heart Attack: నిన్న పుట్టిన రోజు.. నేడు గుండెపోటుతో బాలుడు మృతి

Heart Attack

Heart Attack

రాజస్థాన్‌లో విషాదం చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న పదహారేళ్ల విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. మరణించిన విద్యార్థి యతేంద్ర ఉపాధ్యాయగా గుర్తించారు. అయితే.. నిన్ననే తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోగా, ఈరోజు గుండెపోటుతో మరణించాడు. బండికుయ్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో శనివారం ఉదయం 7 గంటల సమయంలో తరగతి గది లోపలికి వస్తుండగా ఒక్కసారిగా పడిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకు వచ్చింది. అందులో విద్యార్థి వరండాలో పడిపోతున్నట్లు కనిపించింది. ఆ తరువాత.. సమీపంలో కూర్చున్న పాఠశాల ఉద్యోగి అతని వైపు పరిగెత్తుకొచ్చాడు.. విద్యార్థిని లేపడానికి ప్రయత్నించాడు. ఎటువంటి కదలిక లేకపోవడంతో పాఠశాల నిర్వాహకులు అతన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతను చనిపోయినట్లు ప్రకటించారు.

Read Also: By-Elections: జులై 10న ఏడు రాష్ట్రల్లో పదమూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు

వైద్యుడు పవన్ జర్వాల్ మాట్లాడుతూ, ‘పాఠశాల సిబ్బంది బాలుడిని ఆసుపత్రికి తీసుకువచ్చారు. తీసుకొచ్చేసరికి గుండె కొట్టుకోవడం లేదు. మేము CPR (కార్డియోపల్మోనరీ రిససిటేషన్) చేసాము, కానీ ప్రయోజనం లేదని తెలిపారు. విద్యార్థి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 3 సంవత్సరాల క్రితం కూడా విద్యార్థికి గుండె సంబంధిత సమస్య ఉందని.. దాని కారణంగా అతను 15 రోజుల పాటు JK లోన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్లు తెలిపారు. కాగా.. మృతదేహానికి పోస్టుమార్టం చేసేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు సమాచారం అందించడంతో విద్యార్థిని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Read Also: Samantha: సమంత ఆరోగ్య చిట్కాపై పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు..డార్క్ రియాలిటీ అంటూ!

దీనిపై సమాచారం ఇస్తూ.. బండికుయ్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ప్రేమ్ చంద్ మాట్లాడుతూ, యతేంద్ర ఉపాధ్యాయకు గుండెపోటు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. అయితే బాలుడి కుటుంబ సభ్యులు పోస్టుమార్టంకు అంగీకరించలేదు. విద్యార్థిని అంత్యక్రియలు స్వగ్రామమైన అల్వార్‌లో నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.

Exit mobile version