NTV Telugu Site icon

Sharad Pawar: భారత్‌లో కొత్త పుతిన్ తయారవుతున్నాడు.. మోడీపై శరద్ పవార్ ఫైర్‌

Sharad Pawar

Sharad Pawar

Sharad Pawar: మాజీ ప్రధానులు కొత్త భారతదేశాన్ని రూపొందించడానికి పనిచేశారని, అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఇతరులను మాత్రమే విమర్శిస్తున్నారని, గత పదేళ్లలో తన ప్రభుత్వం ప్రజలకు చేసిన వాటి గురించి మాట్లాడలేదని ఎన్సీపీ(ఎస్పీ) నాయకుడు శరద్ పవార్ సోమవారం అన్నారు. మహా వికాస్ అఘాడీ అభ్యర్థి కోసం అమరావతిలో జరిగిన ప్రచార సభలో పవార్ ప్రసంగిస్తూ.. దేశానికి మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చేసిన కృషిని ప్రశ్నించలేమని అన్నారు. కొంతమంది బీజేపీ నాయకులు రాజ్యాంగాన్ని మార్చడం గురించి బహిరంగంగా మాట్లాడారని, భారతదేశంలో నిరంకుశ పాలనను అనుమతించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Read Also: Brij Bhushan: బ్రిజ్భూషణ్కు టికెట్ నిరాకరించిన బీజేపీ.. ఎందుకో తెలుసా..?

అమరావతి లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు చెందిన బల్వంత్ వాంఖడేపై 2019 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన సిట్టింగ్ ఎంపీ నవనీత్ రాణాను బీజేపీ పోటీకి దింపింది. ప్రధాని మోడీ భయాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్‌ను అనుకరిస్తున్నారని శరద్‌ పవార్ ఆరోపించారు. అభ్యర్థి (నవనీత్ రాణా)కి మద్దతు ఇవ్వడం ద్వారా 2019 ఎన్నికల్లో తాను చేసిన పొరపాటుకు అమరావతి ప్రజలకు క్షమాపణ చెప్పేందుకు వచ్చానని శరద్‌ పవార్ చెప్పారు. “గత ఎన్నికల్లో, నేను ప్రజల మద్దతు కోరాను. రాణాను ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశాను. నేను విజ్ఞప్తి చేసిన అభ్యర్థిని ప్రజలు ఎన్నుకున్నారు. ఆ తప్పును సవరించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది” అని ఆయన అన్నారు.

Read Also: Lok Sabha Election: నేడు ఛత్తీస్‌గఢ్‌లో ప్రధాని మోడీ విజయ శంఖనాద్ ర్యాలీ..

కాంగ్రెస్‌కు చెందిన బల్వంత్ వాంఖడే, శివసేన (యూబీటీ), ఎన్‌సీపీ(శరద్‌చంద్ర పవార్), కాంగ్రెస్‌లతో కూడిన త్రైపాక్షిక మహా వికాస్ అఘాడీ (ఎంవిఎ) అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. “ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు నుంచి మన్మోహన్ సింగ్ వరకు దాదాపు అందరు ప్రధానుల పనిని నేను చూశాను. వారి ప్రయత్నాలు నవ భారతదేశాన్ని తయారు చేయడమే, కానీ ప్రస్తుత ప్రధానికి విమర్శించడమే పని” అని పవార్ అన్నారు. మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చేసిన కృషిని చరిత్రలో ఎవరూ మరచిపోలేరని, అయితే ప్రధాని (మోడీ) ఆయనను నిరంతరం విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పడానికి బదులు ఆయన (మోడీ) ఇతరులను విమర్శిస్తూనే ఉన్నారని అని పవార్ అన్నారు. భారత్‌లో కొత్త పుతిన్ తయారీలో ఉన్నారని తాము భయపడుతున్నామన్నారు.

Show comments