Metro Rail: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రోరైలు విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది హెచ్‌ఎండీఏ, హెచ్‌ఎంఆర్‌ఎల్‌లతో పాటు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (హెచ్‌ఏఎంఎల్) కూడా భాగస్వామ్యం కాబోతోంది. ఈనెల 6 నుంచి బిడ్ వేసేందుకు హెచ్‌ఏఎంఎల్ ఆహ్వానం పలికింది. ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు. ఈ నెల 13వరకు బిడ్స్ వేసేందుకు అవకాశం కల్పించనున్నారు.
సుమారు 31 కిలోమీటర్ల నిడివి ఉండే ఈ మార్గాన్ని పూర్తి చేసేందుకు సుమారు రూ.6,250 కోట్లు వ్యయం అవుతుందని గతంలో మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రాయదుర్గం–ఎయిర్‌పోర్టు మెట్రో రైలు ఏర్పాటైతే ఐటీ కారిడార్ నుంచి విమానాశ్రయానికి చేరుకునేవారికి దూరాభారం, సమయం తగ్గుతాయి. ప్రస్తుతం రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి రోడ్డు మార్గంలో చేరుకునేందుకు సుమారు 50 నిమిషాల సమయం పడుతోంది. మెట్రో రైళ్లలో 25 నిమిషాల్లో చేరుకునేందుకు వీలుగా ఎక్స్‌ప్రెస్ మెట్రో కారిడార్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మార్గానికి సంబంధించి ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్ అధికారులు సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్, హెచ్‌ఎండీఏల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)ను కూడా గతంలోనే ఏర్పాటు చేశారు.
Minister Mallareddy: రెండోసారి ఐటీ విచారణకు హాజరైన మంత్రి మల్లారెడ్డి కుమారుడు
విమానాశ్రయ మెట్రో మార్గంలో ప్రతీ ఐదు కిలోమీటర్లకు ఓ మెట్రోస్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది. స్టేషన్లకు అనుసంధానంగా రవాణా ఆధారిత ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలోని గచ్చిబౌలి, అప్పా జంక్షన్, కిస్మత్‌పూర్, గండిగూడ చౌరస్తా, శంషాబాద్ విమానాశ్రయం తదితర ప్రాంతాల్లో స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు స్థలపరిశీలన కూడా పూర్తయింది. పిల్లర్ల ఏర్పాటుకు వీలుగా సాయిల్ టెస్ట్ చేస్తున్నట్టు మెట్రో వర్గాలు తెలిపాయి.