Chandrababu Case: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్‌పై బుధవారం ఏసీబీ కోర్టులో నేడు విచారణ జరగనుంది. చంద్రబాబును 5 రోజుల కస్టడీకి కోరుతూ సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు లాయర్లు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయకపోవడంతో ఏసీబీ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కౌంటర్ పిటిషన్‌ను బుధవారం దాఖలు చేస్తామని చంద్రబాబు తరఫున లాయర్లు న్యాయస్థానానికి వివరించారు. ఇదిలా ఉండగా.. చంద్రబాబుకు జైలులో ప్రాణహాని ఉందని హౌస్ రిమాండ్ విధించాలని వేసిన పిటిషన్‌పై వాదనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబుకు హౌస్ రిమాండ్ అవసరం లేదని ఏపీ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ అడ్వొకేట్ జనరల్‌కు లేఖ రాశారు. కోర్టు ఆదేశాల మేరకు జైలులో చంద్రబాబుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆయన వెల్లడించారు. చంద్రబాబుకు జైల్లో పూర్తి భద్రత కల్పించామని తెలిపారు.
Also Read: Amit Shah: తెలంగాణలో అమిత్ షా పర్యటన.. షెడ్యూల్‌లో కీలక మార్పు..
అయితే టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆ పార్టీ కార్యకర్త మహేష్‌రెడ్డి, కిలారు నితిన్, గింజుపల్లి సుబ్బారావు వేరువేరుగా ఏసీబీ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే సీఐడీ ఎఫ్ఐఆర్‌పై హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలైంది. చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేకుండానే అరెస్ట్ చేశారని కోర్టుకు వెల్లడించారు. రిమాండ్ రిపోర్ట్‌లో ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. చంద్రబాబుపై చేసిన ఆరోపణలన్నీ రాజకీయ కక్షసాధింపులో భాగమేనని తెలిపారు. తప్పుడు కేసులో చంద్రబాబును ఇరికించారని పిటిషన్ వేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో తనను తప్పించాలంటూ చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.
చంద్రబాబు తరపున క్వాష్ పిటిషన్ తో పాటు హైకోర్టులో మరో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణంలో ఏ1గా ఉన్న చంద్రబాబుకు బెయిల్ కోరుతూ మరో పిటిషన్ దాఖలు కాగా.. అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ కోసం ఇంకొక పిటిషన్ దాఖలైంది. చంద్రబాబుకు సంబంధించిన మూడు పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరిగే అవకాశాలు అవకాశాలు ఉన్నాయి. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.