Chennai: కాలం ఎంత వేగంగా మారిపోయినా, కొందరి జీవితాల్లోని సంఘటనలు మాత్రం గుండెను కదిలించేలా ఉంటాయి. ఇలాంటి ఓ సంఘటన తాజాగా చెన్నైలో వెలుగుచూసింది. ఇరవై ఏళ్ల క్రితం తన కుటుంబం నుండి విడిపోయిన వ్యక్తి, రెండు రాష్ట్రాల అధికారుల సహాయంతో తిరిగి తన కుటుంబాన్ని కలుసుకున్నాడు. మన్యం జిల్లా పార్వతీపురం గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు అప్పారావు, కొన్నేళ్ల క్రితం తన స్నేహితులతో కలిసి నిర్మాణ పనుల నిమిత్తం పాండిచ్చేరి వెళ్ళే రైలులో ప్రయాణం సాగించాడు. మార్గమధ్యంలో చెన్నై రైల్వే స్టేషన్‌లో టీ తాగేందుకు రైలు నుంచి దిగిన అతను, తిరిగి తన రైలును చేరుకోలేకపోయాడు.
తనతో పాటు వచ్చిన స్నేహితులను కోల్పోయిన అతను, ఎటు వెళ్లాలో తెలియకపోవడంతో అప్పారావు రామేశ్వరం వెళ్ళే మరో రైలు ఎక్కాడు. అయితే, శివగంగై రైల్వే స్టేషన్ వద్ద దిగిన అతనికి అక్కడ కొత్త సమస్య ఎదురైంది. కలైయార్‌కో సమీపంలోని కడంపన్ గ్రామానికి చెందిన మలైకన్ను అనే వ్యక్తి, ఉద్యోగం ఇప్పిస్తానని ఆశపెట్టి, మేకలు మేపే పనిలోకి అతడిని తీసుకువెళ్లాడు. మూడేళ్ల పాటు మేకలను మేపుతూ జీవితం గడిపిన అప్పారావుకు, మలైకన్ను మరణించిన తర్వాత కూడా స్వేచ్ఛ దక్కలేదు. అదే గ్రామానికి చెందిన అన్నాదురై అనే వ్యక్తి, అతడిని బందీగా ఉంచి మళ్లీ మేకలు మేపే పనిలో నెట్టేశాడు. ఇరవై ఏళ్లుగా ఇంటికి తిరిగి వెళ్లే అవకాశాన్ని కోల్పోయిన ఆయన భాష రాకపోవడం, తెలియని ప్రదేశంలో ఉండటం వల్ల అక్కడే ఉండిపోయాడు.
Read Also: Court : కోర్ట్ తీర్పుకు కలెక్షన్స్ ప్రవాహం.. 2 రోజులకు ఎంతంటే..?
ఇటీవల శివగంగై జిల్లాలోని లేబర్ వెల్ఫేర్ అధికారులు సర్వే నిర్వహించే సందర్భంలో, అప్పారావు బందీ జీవితం బయటపడింది. వెంటనే ఆ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం శివగంగై కలెక్టర్, మన్యం జిల్లా కలెక్టర్‌ల సహాయంతో అప్పారావును ఇంటికి పంపే ఏర్పాట్లు చేశారు. భార్య సీతమ్మ చనిపోవడంతో అప్పారావు కుమార్తె తంబుదొర సాయమ్మ, అల్లుడిని పిలిపించి అప్పారావును కుటుంబంతో కలిపారు అధికారులు. అలా 20 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాని తన తండ్రి గురించి ఎప్పుడూ ఆశలు వదిలేసిన అప్పారావు కుమార్తె తంబుదొర సాయమ్మ, తన తండ్రిని తిరిగి చూసిన క్షణం కంటతడి పెట్టుకుంది. తల్లి సీతమ్మ మరణించిన తర్వాత తన తండ్రిని కనీసం చివరి రోజులలో అయినా చూసుకోవాలని ఆకాంక్షించిన సాయమ్మ రెండు రాష్ట్రాల అధికారులకు కృతజ్ఞతలు తెలియజేసింది.