TSPSC : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) నిర్వహించిన డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్(డీఏవో) రాత పరీక్షలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. తన వివరాలు తప్పుగా నమోదు చేశానని.. ఓ అభ్యర్థి ఏకంగా ఓఎంఆర్ షీటునే మింగేశాడు. నిజామాబాద్ జిల్లా బోర్గాం (పీ) ఉన్నత పాఠశాల పరీక్షాకేంద్రంలో జరిగింది. విషయం తెలియని అధికారులు ఓఎంఆర్ షీట్ ఎలా మిస్సయ్యిందని కాసేపు ఆందోళనకు గురయ్యారు. ఎగ్జామినేషన్ సెంటర్ ఇన్‌చార్జితో పాటు పోలీసులు తెలిపిన వివరాలు.. పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్ అభ్యర్థులకు ఓఎంఆర్ షీట్లను అందజేశారు. నిర్మల్ జిల్లాకు చెందిన ఓ బ్యాంక్ ఉద్యోగి అబ్దుల్ ముఖీద్.. డివిజనల్ అకౌంట్స్ పరీక్షకు హాజరయ్యాడు. పరీక్షకు హాజరుకాని అభ్యర్థులకు కేటాయించిన స్థానాల్లో కూడా పత్రాలను ఉంచారు. ముఖీద్ పక్కన రావాల్సిన ఓ అభ్యర్థి పరీక్షకు గైర్హాజరయ్యాడు. దీంతో ఇన్విజిలేటర్ అతని స్థానంలో ఓఎంఆర్ షీట్ ఉంచాడు.
Read Also: Gun Fire: రాజధానిలో గన్ ఫైర్.. తుపాకీతో కాల్చుకున్న అక్బరుద్దీన్ ఓవైసీ వియ్యంకుడు
అయితే పరీక్ష మొదలైన కాసేపటి తర్వాత ముఖీద్ పక్కన పెట్టిన ఓఎంఆర్ షీట్ కనిపించలేదు. ఓఎంఆర్ షీట్ ఏమైందని ఇన్విజిలేటర్ ముఖీద్ ను ప్రశ్నించాడు.. దానికి తనకేమీ తెలియదన్నాడు. అనుమానం వచ్చిన ఇన్విజిలేటర్ ముఖీద్‌ను నిలదీయడంతో తన ఓఎంఆర్ షీట్‌ను ముక్కలుగా చించి నమిలి మింగేశానని సమాధాన మిచ్చాడు. మింగిన పేపర్ ముక్కల్లో కొన్నింటిని బయటకు తీయించడంతో పాటు ముఖీద్‌ను ఎగ్జామ్ సెంటర్ నుంచి ప్రిన్సిపల్ ఆఫీసుకి తీసుకెళ్లారు. ఎగ్జామ్ హాల్‌లోని సీసీ ఫుటేజీని పరిశీలించగా అబ్దుల్ ముఖీద్.. పక్కన ఉన్న ఓఎంఆర్ షీట్ తీసుకోవడం కనిపించింది. దీంతో ముఖీద్‌ను గట్టిగా నిలదీశారు. తనకు కేటాయించిన ఓఎంఆర్ షీట్‌లో హాల్ టికెట్ నంబర్ తప్పుగా రాశానని అందుకోసమే మరో అభ్యర్థి షీట్‌ను తీసుకున్నట్లు అంగీకరించాడు. ఈ ఘటనపై పరీక్షా కేంద్రం సూపరింటెండెంట్ ఫిర్యాదు మేరకు అబ్దుల్ ముఖీద్‌పై చీటింగ్, మాల్ ప్రాక్టీస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతడి నోట్లో నుంచి స్వాధీనం చేసుకొన్న ఓఎంఆర్ షీట్ ముక్కలను కోర్టులో సమర్పించనున్నట్లు ఎస్సై వెల్లడించారు.