Job Vacancies: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో వివిధ విభాగాలకు సంబంధించి 9,79,327 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో వెల్లడించారు. రైల్వే మంత్రిత్వ శాఖలో 2,93,943, రక్షణ శాఖలో 2,64,704 మంది, హోం వ్యవహారాల్లో 1,43,536 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటిలో గ్రూప్ ఏ పోస్టులు 23,584, గ్రూప్ బీ పోస్టులు 1,18,807, గ్రూప్ సీ పోస్టులు 8,36,936. కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం ఈ విషయం తెలిపారు. వివిధ కేంద్ర శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్‌యూ) పోస్టుల ఖాళీల సంఖ్యపై కాంగ్రెస్ ఎంపీ దీపక్ బైజ్ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఈ ఏడాది ఆగస్టు నాటికి కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9,79,327 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు.
“రైల్వేలో మొత్తం 15,14,007 పోస్టులు ఉండగా, 2,93,943 ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుతం రైల్వే 12,20,064 మంది ఉద్యోగులతో నడుస్తోంది. అదేవిధంగా, డిఫెన్స్ (సివిల్)లో 6,46,042 మంది మంజూరైతే 2,64,707 పోస్టులు ఖాళీగా ఉండగా, హోం వ్యవహారాల శాఖలో 10,85,728 మంది ఉండగా, 1,43,536 పోస్టులు ఖాళీగా ఉన్నాయి” అని సింగ్ లోక్‌సభలో తెలిపారు. అంతేకాకుండా, ప్రధానమంత్రి కార్యాలయం (PMO)లో 446 పోస్టులు మంజూరు కాగా 129 ఖాళీలు ఉన్నాయని.. రాష్ట్రపతి సెక్రటేరియట్‌లో 380 పోస్టులు మంజూరైతే 91 ఖాళీలు ఉన్నాయని ఆయన తెలిపారు.
అక్టోబర్‌లో ప్రభుత్వం 75వేల మంది రిక్రూట్ కాగా.. ఆ తర్వాత నవంబర్‌లో 71వేల మంది నియామకమయ్యారు. కొత్త రిక్రూట్‌మెంట్‌లు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో జరగనున్నాయి. నియామకం పొందినవారు ప్రాథమికంగా ఖాళీగా ఉన్న గ్రూప్ సీ, డీ పోస్టులలో చేరతారు. కొత్తగా చేపట్టే నియామకాల్లో సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్స్ సిబ్బంది (సీఏఎఫ్‌పి), సబ్-ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుల్స్, స్టెనో, పర్సనల్ అసిస్టెన్స్, ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు మొదలైనవి ఉన్నాయి. గ్రూప్ బీ, సీ సర్వీసుల్లో ఖాళీగా ఉన్న దాదాపు 98శాతం ఖాళీలతో సహా వచ్చే ఏడాదిన్నర కాలంలో యుద్ధప్రాతిపదికన 1 మిలియన్ మందిని నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
PM Narendra Modi: గుజరాత్ ప్రజలు బీజేపీవైపే.. హిమాచల్‌లో ఒక్క శాతం ఓట్లతోనే..
గత మూడేళ్లలో కేంద్ర ప్రభుత్వంలోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC), యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC), రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRB) సహా మూడు ప్రధాన రిక్రూటింగ్ ఏజెన్సీల ద్వారా జరిగిన రిక్రూట్‌మెంట్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. యూపీఎస్సీ ద్వారా జరిగిన నియామకాలు 2018-19లో 4,399; 2019-20లో 5,230; 2020-21లో 3,609 పోస్టులు భర్తీకాగా.. మొత్తం 13,238మంది రిక్రూట్ అయ్యారు. అదే విధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2018-19లో 16,748 మందిని నియమించింది; 2019-20లో 14,691; 2020-21లో 68,891; మొత్తం 1,00,330 మంది ఉద్యోగుల నియామకం జరిగింది. ఈ కాలంలో రైల్వే బోర్డు మొత్తం 1,51,900 మందిని నియమించుకుంది. అత్యధికంగా 2019-20లో 1,28,456 మంది నియామకం జరిగింది.