Syria: సిరియాలో బాంబు పేలుడు ఘటన జరిగింది. శుక్రవారం ప్రార్థనల సమయంలో హోమ్స్‌లోనే అలవైట్ ప్రాంతంలోని మసీదులో ఈ సంఘటన జరిగినట్లు ప్రభుత్వం తెలిపింది. మైనారిటీ వర్గంపై జరిగిన ఈ దాడిలో కనీసం 8 మంది మరణించారు. ఇస్లామిస్టులు ఈ ఏడాది బషర్ అల్ అసద్‌ను గద్దె దింపి అధికారాన్ని చేపట్టారు. అధికారం మారిన తర్వాత ఇది రెండో పేలుడు ఘటన. జూన్‌లో డమాస్కస్‌లోని ఒక చర్చిలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 25 మంది మరణించారు.
హోమ్స్ నగరంలోని వాడి అల్ దహబ్ పరిసర ప్రాంతంలోని ఇమామ్ అలీ బిన్ అబి తాలిబ్ మసీదులో లోపల పేలుడు జరిగిందని అక్కడి మీడియా కూడా నివేదించింది. ఈ దాడిలోలో ప్రాథమికంగా కనీసం 8 మంది మరణించగా, 18 మంది గాయపడ్డారని తెలిపింది. శుక్రవారం ప్రార్థనల్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద దాడి జరిగిందని అక్కడి ప్రభుత్వం పేర్కొంది. ఈ దాడికి సంబంధించిన నేరస్తుల్ని పట్టుకునేందుకు విచారణ ప్రారంభించినట్లు వెల్లడించింది. ప్రాథమిక దర్యాప్తులో మసీదులో లోపల అమర్చిన పేలుడ పరికరాల వల్ల పేలుడు సంభవించినట్లు చెప్పారు.
హోమ్స్ నగరంలో ఎక్కువగా సున్నీ ముస్లింలు ఉంటారు. కానీ చాలా ప్రదేశాల్లో అలవైట్‌లు కూడా ఉంటారు. చాలా మంది సిరియన్లు సున్నీలు అయినప్పటికీ, గత పాలకుడు బషర్ అల్ అసద్ మాత్రం మైనారిటీ అలవైట్ సమాజానికి చెందిన వాడు. ఇది షియా ఇస్లాం నుంచి వచ్చింది. 2024లో అసద్ పాలనను వదిలి రష్యా పారిపోయిన తర్వాత, మైనారిటీ అలవైట్లను టార్గెట్ చేస్తూ కిడ్నాప్‌లు, హత్యలు జరిగాయి.