Organ Donation: యాక్సిడెంట్.. బ్రెయిన్ డెడ్.! ఆరుగురి జీవితాల్లో వెలుగునింపిన 7 ఏళ్ల ‘యశ్వన్’.!

Organ Donation

Organ Donation

Organ Donation: సైక్లింగ్ చేస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన 7 ఏళ్ల చిన్నారి ‘యశ్వన్’ అవయవదానంతో 6 మందికి కొత్త జీవితాన్ని ఇచ్చాడు. జూన్ 29వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు తమిళనాడులోని తిరునవెల్లి జిల్లా, చిట్టికులేం గ్రామం, అను విజయ్ టౌన్‌షిప్, కన్యాకుమారి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రోజూ మాదిరిగా ఇంటికి వచ్చి ఆడుకుంటున్న యశ్వన్‌కు సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. ఆడుకుంటుండగా అటుగా వచ్చిన అంబులెన్స్ రాష్‌గా డ్రైవ్ చేయడంతో యశ్వన్‌ను ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్రగాయాలు కాగా ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది.

బ్రెయిన్ డెడ్:

ఈ ఘటన జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు యశ్వన్‌ను కేరళ KIMS ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి త్రివేండ్రంకు రెఫర్ చేశారు. అలా 30వ తేదీ రాత్రి శస్త్రచికిత్స చేసినా యశ్వన్ ఎలాంటి స్పందన ఇవ్వలేదు. మే 1వ తేదీ నుంచి వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగింది. కేరళ ప్రభుత్వ అధికారుల అనుమతితో బ్రెయిన్ డెడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సమయంలో యశ్వన్ అమ్మమ్మ “మనవడి అవయవాలతో ఇతరుల ప్రాణాలు కాపాడదాం” అని సూచించడంతో తల్లితండ్రులు అవయవ దానానికి అంగీకరించారు.

18 గంటల్లో ఆరుగురికి అవయవాలు:

మే 5వ తేదీన యశ్వన్‌ను బ్రెయిన్ డెడ్‌గా డిక్లేర్ చేశారు. ఆ తర్వాత 18 గంటల వ్యవధిలో ‘యశ్వన్’ శరీరంలోని గుండె, కిడ్నీలు, కాలేయం, కళ్లు తదితర అవయవాలను ఆరుగురికి అమర్చారు. ఈ రోజు కేరళ నుంచి యశ్వన్ మృతదేహం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కు చేరుకుంది. అక్కడి నుంచి స్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

యశ్వన్ తల్లితండ్రులు లోకినేని రఘు, లోకినేని సౌమ్య. వీరి స్వస్థలం లింగన్నపేట గ్రామం, గంభీరావుపేట మండలం, తెలంగాణ. వీరికి ఇద్దరు పిల్లలు. చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయినా యశ్వన్ తీసుకున్న ఈ నిర్ణయం సమాజానికి ఆదర్శంగా నిలిచింది. అవయవ దానంపై అవగాహన పెంచేందుకు ఈ ఘటన ఒక ఉదాహరణగా నిలవనుంది.