సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ (BJP) అధినాయకత్వం సరికొత్త వ్యూహం రచిస్తుందా? మూడోసారి ముచ్చటగా హ్యాట్రిక్ కొట్టేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇందుకు ఏడుగురు కేంద్రమంత్రులకు తిరిగి రాజ్యసభ సీట్లు (Rajya Sabha) ఇవ్వకపోవడమే కారణంగా తెలుస్తోంది.
ఇప్పటికే పార్లమెంట్‌లో ప్రధాని మోడీ (PM Modi) మాట్లాడుతూ బీజేపీకి సింగిల్‌గానే 370 సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఎన్డీఏ కూటమి అయితే 400 సీట్లు సాధించడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా.. ఏడుగురు కేంద్రమంత్రులకు రాజ్యసభ సీట్లు నిరాకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో వారిని ఆయా రాష్ట్రాల నుంచి లోక్‌సభ బరిలోకి దింపాలని చూస్తున్నట్లు సమాచారం.
ఈసారి రాజ్యసభకు నామినేట్ చేయని వారిలో ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ (గుజరాత్), విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (మధ్యప్రదేశ్), ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ (కర్ణాటక), పర్యావరణశాఖ మంత్రి భూపేందర్ యాదవ్ (రాజస్థాన్), మత్స్యశాఖ మంత్రి పర్షోత్తమ్ రూపాలా (గుజరాత్), సూక్ష్మ చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రి నారాయణ్ రాణే, జూనియర్ విదేశాంగ మంత్రి వి.మురళీధరన్ ఉన్నారు.
మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన సొంత రాష్ట్రం ఒడిశాలోని సంబల్‌పూర్ లేదా ధేక్నాల్ నుంచి, భూపేందర్ యాదవ్ రాజస్థాన్‌లోని అల్వార్ లేదా మహేంద్రగఢ్ నుంచి, రాజీవ్ చంద్రశేఖర్ బెంగళూరులోని నాలుగు స్థానాల్లో ఒక దాని నుంచి, మాండవీయ గుజరాత్‌లోని భావ్‌నగర్ లేదా సూరత్ నుంచి, రూపాలా రాజ్‌కోట్ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం కేబినెట్‌లో రాజ్యసభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (ఒడిశా), ఎల్. మురుగన్ (మధ్యప్రదేశ్)లు మాత్రమే రాజ్యసభకు పోటీ చేస్తున్నారు.
మొత్తానికి 28 మంది రాజ్యసభ ఎంపీల్లో కేవలం నలుగురికి మాత్రమే బీజేపీ మరోసారి అవకాశం ఇచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఖాళీ అయ్యే 56 స్థానాలకు 28 మంది అభ్యర్థులను పార్టీ ప్రకటించింది. కొత్త వారికే పార్టీ అధిక ప్రాధాన్యత ఇచ్చింది.
ఇదిలా ఉంటే బీజేపీ అధినాయకత్వం లోక్‌సభ ఎన్నికల ప్రిపరేషన్‌లో మునిగితేలుతుంది. అభ్యర్థుల నియామకంతో పాటు పలు వ్యూహాలను రూపొందిస్తోంది. హ్యాట్రిక్ సాధించేందుకు పక్కా ప్రణాళికతో ఎన్నికల రంగంలోకి దిగుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.