Narabali : ఆధునిక సమాజంలో మానవుడు టెక్నాలజీలో దూసుకుపోతున్నాడు. భూమి మీద నుంచి వెళ్లి ఇతర గ్రహాల్లో నివసించే ప్రయత్నాలు చేస్తున్నాడు. రోబోటిక్ యుగం వచ్చి అందని దానిని కూడా అందుకుంటున్నాడు. అయినా కొన్ని చోట్ల ఇంకా మూఢనమ్మకాల ముసుగులోనే ఉండి పోయాడు. మంత్రాలను జపిస్తూ తనను తానే మోసం చేసుకుంటూ ఇతరులను నష్టపరుస్తున్నాడు. ఈ క్రమంలోనే తన స్వార్థం కోసం కొందరి ప్రాణాలకు హాని చేస్తున్నాడు. కొందరు మూర్ఖులు ఇంకా దొంగబాబాల మాటలు నమ్మి మోసపోతున్నారు. మూఢనమ్మకాలు నిజం కాదని అధికారులు, ప్రముఖులు ఎంత మొత్తుకున్న వీటిని ఇంకా కొందరు నమ్ముతూనే ఉన్నారు.
అలాంటి ఘటనే తాజాగా దేశరాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. తనకు ఐశ్వర్యం వస్తుందన్న మూఢనమ్మకంతో మానవత్వం మరిచిపోయి ఆరేళ్ల పసివాడిని నరబలి ఇచ్చారు. ఈ ఘోరం ఢిల్లీలోని లోధి కాలనీలో జరిగింది. బీహార్ కు చెందిన అజయ్ కుమార్, అమర్ కుమార్ లోధి కాలనీలోని మురికి వాడలో జీవిస్తున్నారు. అక్కడే ఉత్తరప్రదేశ్ కు చెందిన బాలుడి కుటుంబం నివసిస్తోంది. వీరు భవన నిర్మాణ కార్మికులు. అజయ్, అమర్ శనివారం పూజల నిమిత్తం పాటలుపాడుతుండగా బాలుడు వారి వద్దకు వెళ్లాడు.
Read Also: New Traffic Rules: నేటి నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్.. ఇవి పాటించకపోతే బాదుడే బాదుడు..
పూజలు ముగిశాక స్థానికులంతా ఇంటికి వెళ్లిపోయారు. కానీ, తన కుమారుడు ఇంకా రాలేదని బాలుడి తండ్రి వెతుక్కుంటూ వెళ్లాడు. ఆ గుడిసెలో రక్తం చారికలు కనిపించడంతో అవాక్కయ్యాడు. లోపల మంచం మీద విగతజీవిగా పడి ఉన్న తన కుమారుడి మృతదేహం చూసి హతాశుడయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాము భోలే బాబాను చూశామని ఆయన డబ్బు కావాలంటే నరబలి ఇవ్వమని కోరినట్లు నిందితులు పోలీసుల విచారణలో తెలిపారు. డబ్బు వస్తుందనే నమ్మకంతో తమ వద్దకు వచ్చిన బాలుడి తలపై మోది, చాకుతో గొంతుకోసి చంపినట్లు నిందితులు అమర్, అజయ్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు.