AAP Corporators Join in BJP: ఇటీవలే జాతీయ పార్టీ హోదాను దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి గుజరాత్‌లో ఎదురుదెబ్బ తగిలింది. 2021లో జరిగిన సూరత్ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ 27 స్థానాలను గెలుచుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడు అక్కడ ఆ పార్టీకి షాక్ తగిలింది. ఆరుగురు ఆప్ కార్పొరేటర్లు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి అధికార బీజేపీలో చేరారు. గుజరాత్ బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్, రాష్ట్ర హోం మంత్రి హర్ష్ సంఘ్వీల సమక్షంలో వారు కాషాయ కండువా కప్పుకున్నారు.
2021లో జరిగిన సూరత్ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ ఏకంగా 27 స్థానాలను గెలుచుకుని ఔరా అనిపించింది. ఈ విజయంతో గుజరాత్‌లో ప్రతిపక్ష హోదాను పొందగలిగింది. ఐదుగురు ఆప్ కార్పొరేటర్లు ఫిబ్రవరి 2022లో బీజేపీలో చేరారు. అయితే వారిలో ఒకరు తిరిగి ఆప్‌లోకి వచ్చారు. ఇప్పుడు మరో ఆరుగురు కార్పొరేటర్లు అధికార పార్టీలో చేరడంతో ఆప్ బలం 17కి పడిపోయింది. మొత్తం 120 సీట్లలో బీజేపీ 93 స్థానాల్లో గెలుపొందింది. ఆప్ నుంచి 10 మంది చేరడంతో బీజేపీ బలం 103కి చేరుకుంది.
Read Also: Karnataka: బీజేపీలో అంతర్గత కలహాలు.. జగదీష్ షెట్టర్ నిర్ణయంపై ఉత్కంఠ
వారి స్వాగత కార్యక్రమంలో హర్ష్ సంఘ్వీ మాట్లాడుతూ.. ఆప్ కార్పొరేటర్లు తమ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారని ఆయన తెలిపారు. ఆప్ అసలు ముఖం నేడు దేశం ముందు వెలుగులోకి వస్తోందన్నారు. ఈ ఆరుగురు కార్పొరేటర్లలో ఒకరైన రూటా ఖేని మాట్లాడుతూ.. కాషాయ పార్టీ సిద్ధాంతాలు, ప్రధాని నరేంద్రమోదీ వ్యవహారశైలితో ప్రభావితమై బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, తమ కార్పొరేటర్లను ప్రలోభపెట్టడంతోపాటు బీజేపీలో చేరమని బెదిరిస్తున్నారని ఆప్ రాష్ట్ర విభాగం ఆరోపించింది