ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు 500 కంటే ఎక్కువ పరుగులు (ఓ సీజన్‌లో) చేసిన ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో ఎనిమిదోసారి కోహ్లీ 500 పరుగుల మైలురాయిని అధిగమించాడు. ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌పై హాఫ్ సెంచరీ చేయడంతో విరాట్ ఖాతాలో ఈ రికార్డు చేరింది.
అత్యధిక సీజన్‌లలో 500 ప్లస్ పరుగులు సాధించిన జాబితాలో విరాట్ కోహ్లీ తర్వాత డేవిడ్ వార్నర్ ఉన్నాడు. వార్నర్ ఏడు సీజన్లలో 500 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో కేఎల్ రాహుల్ ఆరుసార్లు, శిఖర్ ధవన్ ఐదుసార్లు 500 ప్లస్ స్కోర్లు చేశారు. ఐపీఎల్‌లో ఓ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ మరో రికార్డు నెలకొల్పాడు. విరాట్ చెన్నైపై 1146 పరుగులు చేశాడు. ఇంతకుముందు డేవిడ్ వార్నర్ పంజాబ్ కింగ్స్‌పై 1134 పరుగులు చేశాడు.
Also Read: IPL 2025: డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డ గుజరాత్ టైటాన్స్ ఆటగాడు!
విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2024లో 741 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌ల్లో 505 పరుగులు సాధించాడు. ఇప్పటికే 11 ఇన్నింగ్స్‌లలో ఏడు హాఫ్ సెంచరీలు సాధించాడు. విరాట్ సగటు 63.12గా ఉండగా.. స్ట్రైక్ రేట్ 143.46గా ఉంది. ఐపీఎల్ 2016లో విరాట్ 4 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలతో ఏకంగా 973 పరుగులు చేశాడు. కోహ్లీకి ఉత్తమ ఐపీఎల్ సీజన్ అదే. ఈ సీజన్‌లో ఇంకా సెంచరీ చేయకపోయినా.. అద్భుతమైన నిలకడను ప్రదర్శించాడు. బెంగళూరు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవడానికి కారణం కోహ్లీనే అని చెప్పక్కర్లేదు.