కువైట్‌లో అంతులేని విషాదం చోటుచేసుకుంది. పొట్టకూటి కోసం ఇండియా నుంచి తమది కాని దేశం వెళ్లిన కార్మికులు.. నిద్రలోనే తుది శ్వాస విడిచారు. ఈ ఘోర విషాదం కువైట్‌లోని దక్షిణ మంగాఫ్ జిల్లాలో చోటుచేసుకుంది.
బుధవారం తెల్లవారుజామున ఓ ఎత్తైన భవనంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అందరూ నిద్రలో ఉండగా మంటలు అంటుకున్నాయి.. దీంతో నిద్రలోంచి మేల్కొనేలోపే మంటలు, పొగలు కమ్ముకున్నాయి. దీంతో తప్పించుకునే మార్గం లేక అక్కడినే 40 మంది భారతీయులు సజీవదహనం అయ్యారు. పదులు కొద్ది భారతీయులు గాయాలు పాలయ్యారు. వీరంతా ఇండియాలోని ఆయా రాష్ట్రాల నుంచి కార్మికులుగా వెళ్లి ఆ భవనంలో ఉంటున్నారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇదిలా ఉంటే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
మృతుల్లో కేరళకు చెందిన వారు ఎక్కువగా ఉన్నట్లుగా సమాచారం. ఈ ఘటనపై విదేశాంగ మంత్రి జైశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక భారత రాయబార కార్యాలయం నుంచి కేంద్రమంత్రి సమాచారం సేకరిస్తున్నారు. మృతుల కుటుంబాలకు జై శంకర్ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని.. సహాయ అందిస్తామని కేంద్రమంత్రి పేర్కొన్నారు.
“కువైట్ నగరంలో అగ్నిప్రమాద ఘటన వార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. 40 మందికి పైగా మరణించారని మరియు 50 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారని తెలిసింది. తదుపరి సమాచారం కోసం మేము ఎదురుచూస్తున్నాం.’’ అని జైశంకర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
మరోవైపు రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అధికారులు దగ్గర ఉండి పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు. ఇక ప్రమాదానికి గల కారణాలపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. భవనంలో పెద్ద ఎత్తున కార్మికులు ఉన్నారని.. పొగ పీల్చడం వల్లే మరణాల సంఖ్య పెరిగిందని సీనియర్ పోలీస్ కమాండర్ తెలిపారు.
మృతుల కుటుంబాలు సంప్రదించేందుకు భారతీయ ఎంబసీ అత్యవసరం హెల్ప్‌లైన్ నెంబర్ ఏర్పాటు చేసింది. +965-65505246ను సంప్రదించాలని కోరింది.
Amb @AdarshSwaika visited the Al-Adan hospital where over 30 Indian workers injured in today’s fire incident have been admitted. He met a number of patients and assured them of full assistance from the Embassy. Almost all are reported to be stable by hospital authorities. pic.twitter.com/p0LeaErguF
— India in Kuwait (@indembkwt) June 12, 2024