Site icon NTV Telugu

Arvind Kejriwal: మామ మోసం చేశాడు, ఈ చాచాను నమ్మండి.. కేజ్రీవాల్ హామీల వర్షం

Arvind Kejriwal

Arvind Kejriwal

Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం మధ్యప్రదేశ్‌లోని సాత్నాలో జరిగిన ర్యాలీలో ప్రసంగించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో తమ పార్టీ మార్పు తీసుకువస్తుందని ఆయన అన్నారు. ఆప్ టౌన్ హాల్ కార్యక్రమంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ‘మామా’ అని పిలుస్తూ, “మధ్యప్రదేశ్‌లో ఒక మామా ఉన్నారని నాకు తెలుసు. ఆయన తన మేనల్లుళ్లు, మేనకోడళ్లను మోసం చేశారు. ఆయనను నమ్మవద్దు.” అని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. తనను తాను చాచా అని సంబోధించుకున్న కేజ్రీవాల్‌.. తమ పార్టీ అధికారంలోకి వస్తే, రాష్ట్రంలో పాఠశాలలు, ఆసుపత్రులు, ఉపాధి అవకాశాలను తీసుకువస్తానని పేర్కొన్నారు. ఇప్పుడు మీ చాచా వచ్చారని.. మీ మామను నమ్మవద్దని, చాచాపై నమ్మకం ఉంచాలని ఓటర్లను కేజ్రీవాల్‌ కోరారు.

Read Also: HMDA : బీబీనగర్, భువనగిరి చెరువులకు కొత్త అందాలు

ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్‌లో అరవింద్ కేజ్రీవాల్‌ హామీల వర్షం కురిపించారు. మధ్యప్రదేశ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, ప్రతి నెల ప్రతి ఇంటికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు, రాష్ట్రంలోని ప్రతి బాలుడు, బాలికకు ఉచిత విద్య అందిస్తామని కేజ్రీవాల్ చెప్పారు. నిరుద్యోగ యువత అందరికీ ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. ఉద్యోగ నియామకాల్లో సిఫార్సులు, అవినీతి లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఆరోగ్య రంగంలోనూ ఉద్యోగ నియామకాలు ఉంటాయన్నారు ఆప్‌ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్. ప్రభుత్వ బడులను బాగుచేస్తామని, ప్రైవేటు బడుల్లో అక్రమంగా ఫీజులు పెంచకుండా కట్టడి చేస్తామని తెలిపారు. నగరాలతో పాటు గ్రామాల్లో 24 గంటలూ విద్యుత్ అందేలా చేస్తామని అన్నారు.

Exit mobile version